Former Cricketer Ramesh Makes Interesting Comments: పంత్ రీఎంట్రీతో అతడికి ఏ సమస్య ఉండదు.. మాజీ క్రికెటర్ రమేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు
మాజీ క్రికెటర్ రమేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Former Cricketer Ramesh Makes Interesting Comments: భారత టెస్టు జట్టు వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ గాయం కారణంగా ఆటకు దూరమైన నేపథ్యంలో వికెట్ కీపర్‌గా యువ ఆటగాడు ధ్రువ్ జురెల్ నిలకడగా రాణిస్తున్నాడు. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో జురెల్ తన తొలి సెంచరీ(125) నమోదు చేసి సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో పంత్ తిరిగి జట్టులోకి వస్తే జురెల్ పరిస్థితి ఏమిటన్న చర్చ మొదలైంది. ఈ అంశంపై భారత మాజీ క్రికెటర్ సదగోపన్ రమేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
గాయం నుంచి కోలుకుంటున్న పంత్
ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో మాంచెస్టర్ టెస్టు సందర్భంగా పంత్ ఎడమకాలి పాదానికి ఫ్రాక్చర్ కావడంతో కీలకమైన ఐదో టెస్టుకు దూరమయ్యాడు. అయినప్పటికీ కట్టుతోనే బ్యాటింగ్‌కు దిగి అర్ధ శతకం సాధించడం పంత్ పోరాట పటిమను తెలియజేసింది. ప్రస్తుతం బీసీసీఐ ఆధ్వర్యంలో చికిత్స తీసుకుంటున్న పంత్ త్వరలోనే జట్టులోకి తిరిగి వచ్చే అవకాశం ఉంది.
జురెల్ అద్భుత ప్రదర్శన
పంత్ గైర్హాజరీలో జురెల్ వికెట్ కీపర్‌గా బాధ్యతలు తీసుకుని నిలకడగా పరుగులు సాధిస్తున్నాడు. ఆరు టెస్టుల్లో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ సహా 380 పరుగులు చేశాడు. ఇటీవల ఆస్ట్రేలియా-ఎ జట్టుతో అనధికారిక టెస్టులో కెప్టెన్‌గానూ వ్యవహరించాడు.
సదగోపన్ రమేశ్ కీలక విశ్లేషణ
పంత్ రాకతో జురెల్‌కు పోటీ ఉంటుందని అంతా భావిస్తున్న నేపథ్యంలో సదగోపన్ రమేశ్ భిన్నమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. "బీస్ట్ లాంటి పంత్‌తో జురెల్‌కు పోటీ ఉంది. అయితే ఈ సెంచరీ ద్వారా మేనేజ్‌మెంట్‌కు అతడు ఓ విషయం స్పష్టం చేశాడు. తనకు పంత్‌కు మధ్య పోటీ లేదని.. తాను అచ్చమైన బ్యాటర్‌గా అందుబాటులో ఉంటానని సంకేతాలు ఇచ్చాడు. సాయి సుదర్శన్ గనుక మూడో స్థానంలో విఫలమవుతూ ఉన్నా.. నితీశ్ రెడ్డి బ్యాట్‌తో రాణించకపోయినా.. ఈ రెండు సందర్భాల్లో జురెల్‌కు ఢోకా ఉండదు. ఒకవేళ రిషభ్ పంత్ తిరిగి వచ్చినా, జురెల్ మూడో నంబర్ ఆటగాడిగా ఫిక్సయిపోవచ్చు" అని రమేశ్ పేర్కొన్నారు.
మొత్తంగా పంత్ తిరిగి వచ్చినా, జురెల్ తన బ్యాటింగ్ నైపుణ్యంతో టెస్టు జట్టులో కేవలం కీపర్‌గానే కాకుండా, అదనపు బ్యాటర్‌గా సుస్థిర స్థానం సంపాదించుకునే అవకాశం ఉందని రమేశ్ విశ్లేషించారు.