PCB Chief Nakhvi: ఆర్థిక నష్టాలు, ప్రభుత్వ మద్దతు వల్లే ఆసియా కప్‌లో కొనసాగుతున్నాం: పీసీబీ చీఫ్‌ నఖ్వి

ఆసియా కప్‌లో కొనసాగుతున్నాం: పీసీబీ చీఫ్‌ నఖ్వి

Update: 2025-09-18 13:29 GMT

PCB Chief Nakhvi: ఆసియా కప్‌ నుంచి వైదొలగితే భారీ ఆర్థిక నష్టం తప్పదని భావించిన పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు టోర్నీలో కొనసాగుతోంది. అయితే దీనికి కారణం ఆర్థిక నష్టమేనని పీసీబీ చీఫ్‌ మోసిన్‌ నఖ్వి స్వయంగా వెల్లడించారు. తాము ఐసీసీ రిఫరీ క్షమాపణలు చెప్పడంతోనే ఆడుతున్నామని చెబుతున్నప్పటికీ, లోపల మాత్రం పరిస్థితి వేరేలా ఉన్నట్లు ఆయన మాటలను బట్టి తెలుస్తోంది.

మేం బహిష్కరించాలని అనుకుంటే పెద్ద నిర్ణయమే అవుతుంది

యూఏఈపై విజయం సాధించి సూపర్‌-4కి చేరుకున్న పాకిస్థాన్‌ జట్టు, ఈ సందర్భంగా టోర్నీలో కొనసాగడానికి గల కారణాలను నఖ్వి వెల్లడించారు. “సెప్టెంబర్‌ 14 నుంచి ఇలాంటి పరిస్థితులు వచ్చాయి. మ్యాచ్‌ రిఫరీ పాత్రపై మేం అభ్యంతరం వ్యక్తం చేశాం. అయితే యూఏఈతో పోరుకు ముందు మ్యాచ్‌ రిఫరీ మా టీమ్‌ కోచ్, కెప్టెన్, మేనేజర్‌తో మాట్లాడారు. షేక్ హ్యాండ్ ఘటన జరిగి ఉండకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. మేం ఇప్పటికే కోడ్ అతిక్రమణపై విచారణ జరపాలని ఐసీసీని కోరాం. క్రీడలు, రాజకీయాలు ఎప్పటికీ ఒకటి కాదని మేం నమ్ముతున్నాం. ఇది ఆట. అలాగే ఉండనివ్వండి. మిగతా వాటి నుంచి ప్రత్యేకంగా ఉండాలి. ఒకవేళ మేం ఆసియా కప్‌ను బహిష్కరించాలని అనుకుంటే పెద్ద నిర్ణయమే అవుతుంది. అయితే ప్రధానమంత్రితోపాటు ప్రభుత్వ అధికారులు, ఇంకా చాలా మంది మద్దతు మాకు ఉంది. కానీ, మేం అలా చేయడం లేదు. సమస్యను పరిష్కరించడంపైనే దృష్టి పెట్టాం” అని నఖ్వి వ్యాఖ్యానించారు.

సూపర్-4లో మరోసారి భారత్-పాక్‌ పోరు

గ్రూప్ స్టేజ్‌లో ఇప్పటికే ఒకసారి తలపడిన భారత్, పాకిస్థాన్‌ మరోసారి ఢీకొనడం ఖాయం. సూపర్‌-4లో అడుగుపెట్టిన భారత్‌, పాక్‌లు సెప్టెంబర్‌ 21న తలపడతాయి. టీమ్‌ఇండియా ఇంకా గ్రూప్‌ స్టేజ్‌లో తన చివరి మ్యాచ్‌ను ఒమన్‌తో ఆడాల్సి ఉంది. శుక్రవారం జరిగే ఈ మ్యాచ్‌లో గెలిచినా, ఓడినా నెట్‌ రన్‌రేట్‌ భారీగా ఉన్నందున గ్రూప్‌లో భారత్‌దే అగ్రస్థానం కానుంది.

రెండో గ్రూప్‌ నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌లు సూపర్‌-4 బెర్తుల కోసం పోటీపడుతున్నాయి. ఈరోజు జరిగే శ్రీలంక-అఫ్గానిస్థాన్‌ మ్యాచ్‌తో ఈ బెర్తులు ఖరారు కానున్నాయి. ఈ మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌ స్వల్ప తేడాతో విజయం సాధించినా చాలు తదుపరి దశకు చేరుకుంటుంది. మరోవైపు శ్రీలంక ఘోర పరాజయం చవిచూడకుండా ఉండాలి. ఒకవేళ అలా జరిగితే, నెట్‌ రన్‌రేట్‌ ఆధారంగా బంగ్లాదేశ్‌ తదుపరి దశకు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

Tags:    

Similar News