Harbhajan Singh: భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తరచూ విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, ఆయనకు మద్దతుగా నిలిచారు మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్. టీమిండియా మ్యాచ్‌లలో ఓడిపోయిన వెంటనే నిందలన్నీ కోచ్‌పైనే మోపడం సరికాదని హర్భజన్ హితవు పలికారు. గంభీర్ వ్యక్తిత్వం ఏంటో తనకు బాగా తెలుసని ఆయన స్పష్టం చేశారు.

గౌతమ్ గంభీర్ అత్యంత ముక్కుసూటి మనిసని, ఆట పట్ల ఆయనది ఎప్పుడూ రాజీపడని నైజం అని హర్భజన్ కొనియాడారు. గంభీర్ మాట్లాడేది ఎప్పుడూ కఠినమైన నిజమేనని, అయితే ఆ నిజాలు చెప్పే తీరు కొందరికి మింగుడుపడకపోవచ్చని, అందుకే ఆయనపై అనవసర విమర్శలు వస్తుంటాయని అభిప్రాయపడ్డారు. కేవలం పైకి కనిపించే రూపాన్ని చూసి మనుషులను అంచనా వేయకూడదని, గంభీర్ ఒక అద్భుతమైన వ్యక్తి అని తెలిపారు. జట్టును ఎప్పుడూ "గెలవడమే లక్ష్యంగా" ఆడించాలని కోరుకునే తత్వం ఆయనదని హర్భజన్ గుర్తుచేశారు.

క్రికెట్‌లో గెలుపు ఓటములు సహజమని, కానీ ప్రతి ఓటమికి కోచ్‌ను మాత్రమే బాధ్యులను చేయడం తగదని హర్భజన్ తేల్చిచెప్పారు. గంభీర్ కోచింగ్‌లో భారత జట్టు ఇప్పటికే ఎన్నో అద్భుత విజయాలను సాధించిందని ఆయన పేర్కొన్నారు. ఏది ఏమైనప్పటికీ, గంభీర్ శైలిపై హర్భజన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

Tags: