Pink Ball in Test Cricket: టెస్ట్ క్రికెట్‌లో పింక్ బాల్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.!
అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.!
Pink Ball in Test Cricket: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టెస్ట్ క్రికెట్‌లో సరికొత్త విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. అహ్మదాబాద్‌లో జరిగిన రెండు రోజుల వార్షిక సమావేశంలో క్రికెట్ నిబంధనలను మారుస్తూ ఐసీసీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
టెస్ట్ క్రికెట్‌లో పింక్ బాల్ ప్రయోగం
ఇకపై బ్యాడ్ లైట్ (వెలుతురు లేకపోవడం) కారణంగా టెస్ట్ మ్యాచ్‌లు నిలిచిపోవడానికి వీల్లేదు! ఇందుకోసం ప్రయోగాత్మకంగా 'పింక్ బాల్' ఉపయోగించేందుకు ఐసీసీ ఆమోదం తెలిపింది.మ్యాచ్ ఎరుపు రంగు బంతితోనే ప్రారంభమవుతుంది. ఒకవేళ వెలుతురు తగ్గినప్పుడు.. ఇరు జట్లు సిరీస్‌కు ముందే అంగీకరిస్తే, ఫ్లడ్‌లైట్ల వెలుతురులో పింక్ బాల్‌తో మిగిలిన ఓవర్లను పూర్తి చేస్తారు.
టీ20ల తరహాలోనే ఇకపై టెస్ట్ మ్యాచ్‌లలోనూ షెడ్యూల్ ప్రకారం జరిగే డ్రింక్స్ బ్రేక్ సమయంలో హెడ్ కోచ్‌లు మైదానంలోకి వెళ్ళవచ్చు. ఆటగాళ్లతో నేరుగా వ్యూహాలు చర్చించవచ్చు.మరోవైపు బౌలర్ల శైలిని అదుపు చేయడానికి, అనుమానాస్పద బౌలింగ్ యాక్షన్‌ను కనిపెట్టడానికి ఆన్-ఫీల్డ్ అంపైర్లకు 'హాక్-ఐ' (Hawk-Eye) డేటాను పరిశీలించే సదుపాయాన్ని కల్పించారు. ఈ కొత్త నిబంధనలన్నీ 2026 అక్టోబర్ 1 నుంచి అంతర్జాతీయ క్రికెట్‌లో అమలులోకి రానున్నాయి.
క్రికెట్ కెనడాపై వేటు
నిబంధనల ఉల్లంఘన, అవినీతి ఆరోపణల నేపథ్యంలో క్రికెట్ కెనడా సభ్యత్వాన్ని ఐసీసీ తక్షణమే రద్దు చేసింది. అయితే ఆటగాళ్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని.. కెనడా జాతీయ జట్టు ఐసీసీ ఈవెంట్లలో ఆడేందుకు మాత్రం అనుమతించింది.
మహిళల టోర్నీల షెడ్యూల్‌లో మార్పులు
మహిళల చాంపియన్స్ ట్రోఫీ 2027 షెడ్యూల్‌లో మార్పులు జరిగాయి. గతంలో జూన్, జులైలో జరగాల్సిన ఈ టోర్నీని.. 2027 ఫిబ్రవరికి మారుస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. అలాగే 2026లో ఐదు ఫుల్ మెంబర్స్, ఐదు అసోసియేట్ మెంబర్స్ జట్లతో కలిపి మొత్తం 10 జట్లతో 'మహిళల ఎమర్జింగ్ నేషన్స్ ట్రోఫీ'ని పైలట్ ప్రాజెక్ట్‌గా నిర్వహించనున్నారు.