Rahane: రోహిత్ శర్మపై రహానే సంచలన వ్యాఖ్యలు: 2027 వరల్డ్ కప్ ఆడాల్సిందే.!
2027 వరల్డ్ కప్ ఆడాల్సిందే.!
Rahane: భారత క్రికెట్ జట్టులో 'హిట్‌మ్యాన్' రోహిత్ శర్మ భవిష్యత్తుపై మరోసారి హాట్ చర్చ నడుస్తోంది. 2027 వన్డే వరల్డ్ కప్ ప్రణాళికల్లో రోహిత్ ఉంటాడా లేదా అనే సందిగ్ధతపై టీమిండియా మాజీ వైస్ కెప్టెన్ అజింక్య రహానే స్పష్టమైన మరియు సంచలన వ్యాఖ్యలు చేశారు.
వయసు, ఫిట్‌నెస్‌ను సాకుగా చూపిస్తూ సెలెక్టర్లు రోహిత్ పక్కన పెట్టే ఆలోచనలో ఉన్నారనే వార్తలు ఇటీవల గుప్పుమన్నాయి. సరిగ్గా అప్పుడే ఇంగ్లాండ్ పర్యటనలో లార్డ్స్ వేదికగా జరిగిన మూడో వన్డేలో రోహిత్ శర్మ అద్భుతమైన సెంచరీ (137 పరుగులు) బాది విమర్శకుల నోళ్లు మూయించాడు. తన బ్యాట్‌తోనే రూమర్లన్నింటికీ గట్టి సమాధానం ఇచ్చాడు.
ప్రముఖ పత్రిక 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అజింక్య రహానే మాట్లాడుతూ.. రోహిత్ శర్మ లాంటి స్థాయి ఆటగాడిని ప్రతి సిరీస్‌కూ బేరీజు వేయడం సరికాదని స్పష్టం చేశారు. 2027 వరల్డ్ కప్ నువ్వే ఆడుతున్నావని బీసీసీఐ, సెలెక్టర్లు రోహిత్‌కు ఇప్పుడే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇన్ని సంవత్సరాలుగా భారత జట్టుకు రోహిత్ అందించిన సేవలు అపారమని గుర్తుచేశారు.
క్రికెట్ అనేది కేవలం ఆట మాత్రమే కాదని, అది పూర్తిగా మైండ్ గేమ్ అని రహానే పేర్కొన్నారు. ఆటగాడి మనసు ప్రశాంతంగా, ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉన్నప్పుడే అతను స్వేచ్ఛగా రాణించగలడని చెప్పారు. మెగా టోర్నమెంట్‌లో రోహిత్ లాంటి సీనియర్ ఆటగాడి అనుభవం జట్టు విజయావకాశాలకు ఎంతైనా అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.