Stands Named After Dravid and Kumble: అరుదైన గౌరవం: ద్రవిడ్, కుంబ్లే పేర్లతో స్టాండ్స్!

ద్రవిడ్, కుంబ్లే పేర్లతో స్టాండ్స్!

Update: 2026-02-14 11:20 GMT

Stands Named After Dravid and Kumble: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం అంటే క్రికెట్ అభిమానులకు ఒక దేవాలయం లాంటిది. అలాంటి ప్రతిష్టాత్మక మైదానంలో టీమిండియా దిగ్గజాలు రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లేల పేర్లను స్టాండ్స్‌కు పెట్టడం ద్వారా కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA) వారిని ఘనంగా గౌరవించింది. ఈ సందర్భంగా రాహుల్ ద్రవిడ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన కెరీర్‌లో అత్యధిక సమయం గడిపిన ఈ మైదానంలో తన పేరు మీద ఒక స్టాండ్ ఉండటం అనేది వర్ణించలేని అనుభూతిని ఇస్తోందని ఆయన పేర్కొన్నారు. మాజీ పేసర్ వెంకటేష్ ప్రసాద్ నేతృత్వంలోని కమిటీ ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల ద్రవిడ్ కృతజ్ఞతలు తెలిపారు.

చిన్నస్వామి స్టేడియం తనకు రెండో ఇల్లు లాంటిదని, తన జీవితంలో సొంత ఇంట్లో గడిపిన సమయం కంటే ఈ మైదానంలోనే ఎక్కువ కాలం ఉన్నానని ద్రవిడ్ గుర్తు చేసుకున్నారు. ఇక్కడ తనకు ఎన్నో తీపి గుర్తులు ఉన్నాయని, కొన్ని సార్లు నిరాశ ఎదురైనా.. ఈ మైదానమే తనను ఈ స్థాయికి చేర్చిందని కొనియాడారు. కేఎస్‌సీఏ మరియు ఈ చారిత్రాత్మక గ్రౌండ్ తనకు ఇచ్చిన గౌరవానికి తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని ద్రవిడ్ ఎంతో వినమ్రంగా చెప్పారు. అనిల్ కుంబ్లేతో కలిసి దశాబ్దాల కాలం పాటు ఇక్కడ ప్రాక్టీస్ చేసిన రోజులను ఆయన నెమరువేసుకున్నారు.

ముఖ్యంగా తన తండ్రి గురించి మాట్లాడుతూ ద్రవిడ్ చాలా ఎమోషనల్ అయ్యారు. తన తండ్రికి క్రికెట్ అంటే ప్రాణమని, చిన్నతనంలో తండ్రితో కలిసి ఈ స్టేడియానికి వచ్చి మ్యాచ్‌లు చూసేవాడినని తెలిపారు. క్రికెట్ పట్ల తనలో మక్కువ కలగడానికి తన తండ్రే ప్రధాన కారణమని, ఇప్పుడు తన పేరు మీద స్టేడియంలో ఒక స్టాండ్ ఉండటం చూసి ఆయన ఎంతో సంతోషిస్తారని ద్రవిడ్ భావించారు. ఈ గౌరవం తన కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైనదని, ఈ అరుదైన మైలురాయిని తన కెరీర్‌లో అత్యున్నత గౌరవంగా భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

Tags:    

Similar News