Riyan Parag in Trouble: చిక్కుల్లో రియాన్.. వేటా.? జైలు శిక్షనా.?

వేటా.? జైలు శిక్షనా.?

Update: 2026-04-30 02:56 GMT

Riyan Parag in Trouble: ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతుంటే.. ఆ జట్టు కెప్టెన్ రియాన్ పరాగ్ మాత్రం ఊహించని వివాదంలో చిక్కుకున్నాడు. మైదానంలో ఆటతో కంటే, డ్రెస్సింగ్ రూమ్‌లో చేసిన ఒక పని ఇప్పుడు సోషల్ మీడియాలో దావాగ్నిలా వ్యాపిస్తోంది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో.. రాజస్థాన్ జట్టు లక్ష్య ఛేదనలో ఉన్న సమయంలో, పరాగ్ చేసిన పని క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

మ్యాచ్ 16వ ఓవర్ నడుస్తున్న సమయం.. రాజస్థాన్ బ్యాటర్లు విజయం కోసం పోరాడుతున్నారు. సరిగ్గా అదే సమయంలో కెమెరా కన్ను డ్రెస్సింగ్ రూమ్ వైపు మళ్లింది. అక్కడ ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్ పక్కన కూర్చున్న రియాన్ పరాగ్.. చేతిలో 'ఈ-సిగరెట్' పట్టుకుని ధూమపానం చేస్తూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు క్షణాల్లో వైరల్ అయ్యాయి. బాధ్యతాయుతమైన కెప్టెన్ హోదాలో ఉండి, తోటి ఆటగాళ్ల మధ్య ఇలాంటి పనులేంటని నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

అయితే ఇది కేవలం క్రమశిక్షణ ఉల్లంఘనే కాదు.. అంతకు మించి పెద్ద నేరం కూడా కావచ్చు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం.. స్టేడియంలో కానీ, డ్రెస్సింగ్ రూమ్‌లో కానీ పొగ తాగడం నిషిద్ధం. ఒకవేళ తాగాలనుకుంటే నిర్దేశించిన ప్రత్యేక ప్రదేశాల్లోనే తాగాలి. దీనికి తోడు, భారత్‌లో 2019 నుంచి ఈ-సిగరెట్ల విక్రయం, వాడకంపై పూర్తి నిషేధం ఉంది. ఎలక్ట్రానిక్ సిగరెట్ల నిషేధ చట్టం (PECA) 2019 ప్రకారం.. పరాగ్ నేరం నిరూపితమైతే భారీ జరిమానాతో పాటు, కొన్ని సందర్భాల్లో జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంది.

ఇప్పటికే ఈ ఘటనపై బీసీసీఐ (BCCI) దృష్టి సారించినట్లు తెలుస్తోంది. క్రమశిక్షణా చర్యల్లో భాగంగా పరాగ్‌పై భారీ ఫైన్ లేదా కొన్ని మ్యాచ్‌ల పాటు నిషేధం విధించే ఛాన్స్ ఉంది. మరి ఈ వివాదంపై అటు రాజస్థాన్ యాజమాన్యం కానీ, ఇటు రియాన్ పరాగ్ కానీ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Tags:    

Similar News