Joe Root: ఇంగ్లండ్, భారత్‌ జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో జరగనుంది. ఈ మ్యాచ్ లో జో రూట్ భారత్‌పై చరిత్ర లిఖించే దిశగా అడుగులు వేస్తున్నాడు. భారత్‌పై 2927 పరుగులు చేసిన రూట్, టెస్ట్ క్రికెట్‌లో భారత్‌పై 3000 పరుగులు చేసిన ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా నిలిచేందుకు 73 పరుగులు అవసరం. రూట్ ఇప్పటికే భారత్‌పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్నాడు. అతని తర్వాత ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఉన్నారు. అతను భారత్‌పై 2555 పరుగులు చేశాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో 6000 పరుగులు చేసిన ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా జో రూట్ కూడా రికార్డు సృష్టించాడు. కానీ ఒక్క టెస్ట్ మ్యాచ్‌లోనూ అతను ఈ మైలురాయిని చేరుకోలేడు. రూట్ ఇప్పటివరకు WTCలో 5624 పరుగులు చేశాడు. 6000 పరుగులు చేరుకోవడానికి అతనికి ఇంకా 376 పరుగులు అవసరం. కాగా ఇప్పటికే జో రూట్ అరుదైన రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లండ్ గ‌డ్డపై భార‌త్‌-ఇంగ్లండ్ మ‌ధ్య టెస్టుల్లో అత్య‌ధిక‌ ప‌రుగులు చేసిన బ్యాట‌ర్‌గా రూట్ నిలిచాడు. లీడ్స్ వేదిక‌గా టీమిండియాతో జరిగిన తొలి టెస్టులో రూట్ ఈ ఫీట్ సాధించాడు. రూట్ ఇప్ప‌టివ‌ర‌కు ఇంగ్లండ్‌లో భార‌త్‌తో జ‌రిగిన టెస్టుల్లో 1589 ప‌రుగులు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు భార‌త క్రికెట్ దిగ్గ‌జం స‌చిన్ టెండూల్క‌ర్ పేరిట ఉండేది. ఇంగ్లండ్ గ‌డ్డ‌పై స‌చిన్ 1575 ప‌రుగులు చేశాడు.

Tags: