Royal Challengers Bangalore: అమ్మకానికి ఆర్సీబీ.. చివరి దశకు డీల్

చివరి దశకు డీల్

Update: 2026-03-18 11:16 GMT

Royal Challengers Bangalore: ఐపీఎల్లో 2025 చాంపియన్ గా నిలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ అమ్మకం ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. స్వీడన్కు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ ఈక్యూటీ భారీ బిడ్ పెట్టినట్లు సమాచారం. మరోవైపు మణిపాల్ హాస్పిటల్స్ అధినేత రంజన్ పై, అమెరికా సంస్థ కేకేఆర్, సింగపూర్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ టెమాసెక్ కలసిన కన్సార్టియం కూడా పోటీలో ఉంది. మొత్తం డీల్ విలువ సుమారు 2 బిలియన్ డాలర్ల వరకు ఉండొచ్చని అంచనా. ప్రారంభంలో మాంచెస్టర్ యునైటెడ్ సహ యజమానులు గ్లేజర్స్, అదార్ పూనావాలా కూడా ఆసక్తి చూపినప్పటికీ చివరికి రేసు నుంచి తప్పుకున్నారు. గ్లేజర్స్ సుమారు 1.8 బిలియన్ డాలర్ల నాన్ బైండింగ్ ఆఫర్ ఇచ్చినట్లు, అయితే ఈక్యూటీ దాన్ని దాటేలా బిడ్ పెంచినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

ప్రస్తుతం ఈ డీల్ సూటిగా బిడ్డింగ్ పోరుగా మారింది. డయాజియో గ్రూప్ మార్చి 31ని గడువుగా పెట్టి ఈ అమ్మకాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ఇదే సమయంలో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీకి కూడా భారీ ఆసక్తి కనిపిస్తోంది. మూడు సంస్థలు బైండింగ్ బిడ్లు సమర్పించినట్లు తెలుస్తోంది. ఆదిత్య బిర్లా గ్రూప్ ఫేవరెట్గా నిలుస్తోంది. మొదట మెజారిటీ వాటా అమ్మాలని భావించిన రాజస్థాన్ రాయల్స్ యాజమా న్యం ఇప్పుడు పూర్తి విక్రయానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఫ్రాంచైజీ విలువ 1.1 బిలియన్ నుంచి 1.35 బిలియన్ డాలర్ల మధ్య ఉండొచ్చని అంచనా. రైన్ గ్రూప్ ఈ అమ్మక ప్రక్రియను పర్యవేక్షిస్తోంది. అమెరికాకు చెందిన డేవిడ్ బ్లిట్జర్, ఆదిత్య బిర్లా గ్రూప్ కలిసి కన్సార్టియం గా బిడ్ సమర్పించినట్లు తెలుస్తోంది. మార్చి 31 ఈ డీల్కూ కీలక గడువుగా ఉంది.

Tags:    

Similar News