Sachin: క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ తన కెరీర్‌కు సంబంధించిన అమూల్యమైన జ్ఞాపకాలను అభిమానుల కోసం అందుబాటులో ఉంచనున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో తాను ఉపయోగించిన 26 బ్యాట్లను ముంబయి క్రికెట్ సంఘం (ఎంసీఏ)కు చెందిన శరద్ పవార్ క్రికెట్ మ్యూజియంలో ప్రదర్శన కోసం బహుమతిగా ఇవ్వనున్నాడు. అంతర్జాతీయ శతకాలు చేసేందుకు ఉపయోగించిన కొన్ని బ్యాట్లు కూడా ఇందులో ఉన్నాయి.


బ్యాట్లతో పాటు హెల్మెట్లు, జెర్సీలు, కెరీర్‌లో చరిత్రాత్మక ఘట్టాలకు సంబంధించి తాను వ్యక్తిగతంగా రాసుకున్న నోట్స్‌ను కూడా మ్యూజియానికి అందజేయనున్నాడు. ‘బ్యాటోగ్రఫీ’ పేరిట నిర్వహించనున్న ఈ ప్రత్యేక ప్రదర్శనను ఈనెల 16న జరిగే కార్యక్రమంలో ఆవిష్కరించనున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌కు సచిన్ వీడ్కోలు పలికి 13 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ ఏర్పాటు చేశారు. 2013 నవంబరు 16న సొంతగడ్డ వాంఖడే స్టేడియంలో వెస్టిండీస్‌పై సచిన్ చివరి అంతర్జాతీయ మ్యాచ్ (200వ టెస్టు) ఆడాడు.


ఈ ప్రదర్శన ద్వారా సచిన్ కెరీర్‌లోని మైలురాళ్లను, ఆ ఘట్టాలకు ఉపయోగించిన బ్యాట్ల ద్వారా అభిమానులు సమీపంగా చూసే అవకాశం లభిస్తుంది. ఎంసీఏ అధికారులు ఈ చర్యను స్వాగతించారు. సచిన్ వారసత్వం తరతరాలకు అందుబాటులో ఉండేలా ఈ బహుమతి ఇచ్చారని పేర్కొన్నారు.

Tags: