Sanjay Bangar: కమిన్స్ తిరిగొచ్చినా ఇషాన్ నే కెప్టెన్ గా కొనసాగించాలి: సంజయ్ బంగర్

ఇషాన్ నే కెప్టెన్ గా కొనసాగించాలి: సంజయ్ బంగర్

Update: 2026-04-23 03:40 GMT

Sanjay Bangar: ఐపీఎల్ 2026 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. మైదానంలో ఆటగాళ్ల మెరుపులే కాదు, మైదానం బయట వినిపిస్తున్న విశ్లేషణలు కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్సీ విషయంలో టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆరెంజ్ ఆర్మీ అభిమానుల్లో పెద్ద చర్చకు దారితీశాయి.

రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ గైర్హాజరీలో జట్టు పగ్గాలు చేపట్టిన ఇషాన్ కిషన్.. తన నాయకత్వంతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఈ సీజన్‌లో ఇషాన్ కెప్టెన్సీ అద్భుతంగా ఉందంటూ సంజయ్ బంగర్ ఆకాశానికెత్తేశారు. ముఖ్యంగా బౌలర్లను ప్రయోగించడంలో ఇషాన్ అనుసరిస్తున్న వ్యూహాలు జట్టుకు పెద్ద ప్లస్ అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రత్యర్థి బ్యాటర్ల వీక్ పాయింట్స్ కనిపెట్టి, దానికి తగ్గట్టుగా బౌలర్లను మార్చడంలో ఇషాన్ మంచి పట్టు సాధించాడని కొనియాడారు.

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌ను ఉదాహరణగా తీసుకుంటూ.. ఆ మ్యాచ్‌లో స్పిన్నర్లను ఇషాన్ కిషన్ వాడిన తీరు అమోఘమని బంగర్ అన్నారు. ఎలాంటి ఆందోళన చెందకుండా, క్లిష్ట పరిస్థితుల్లో కూడా సరైన నిర్ణయాలు తీసుకోవడం ఒక పరిణతి చెందిన కెప్టెన్ లక్షణమని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే, ఒకవేళ ప్యాట్ కమిన్స్ జట్టులోకి తిరిగి వచ్చినా.. నాయకత్వ బాధ్యతలను ఇషాన్ కిషన్‌కే అప్పగించాలని బంగర్ ఎస్‌ఆర్‌హెచ్ మేనేజ్‌మెంట్‌కు సూచించారు.

మరోవైపు ప్యాట్ కమిన్స్ ఫిట్‌నెస్ పట్ల బంగర్ సందేహాలు వ్యక్తం చేశారు. సీజన్ మొత్తం కమిన్స్ ఫిట్‌నెస్ నిలకడగా ఉంటుందని మనం హామీ ఇవ్వలేమని, ఇలాంటి సమయంలో జట్టులో స్థిరత్వం కోసం ఇషాన్ కిషన్‌నే కెప్టెన్‌గా కొనసాగించడం ఉత్తమమని ఆయన వివరించారు.

Tags:    

Similar News