Second Test: రెండో టెస్టు: టామ్ బ్లండెల్ బాధ్యతాయుత ఇన్నింగ్స్.. కోలుకున్న న్యూజిలాండ్
కోలుకున్న న్యూజిలాండ్
Second Test: ఇంగ్లాండ్‌తో ఓవల్ వేదికగా ప్రారంభమైన రెండో టెస్ట్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు మొదటి రోజు ఆట ముగిసే సమయానికి తమ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. ఒక దశలో 107 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన కివీస్ జట్టును వికెట్ కీపర్ బ్యాటర్ టామ్ బ్లండెల్ (51), గ్లెన్ ఫిలిప్స్ (49 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్‌లతో ఆదుకున్నారు. లార్డ్స్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో ఎదురైన ఓటమిని పక్కనపెట్టి, ఈ మ్యాచ్‌లో కివీస్ బ్యాటర్లు మెరుగైన ప్రదర్శన కనబరిచారు.
టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు పిచ్‌పై ఉన్న పేస్, బౌన్స్‌ను అనుకూలంగా మార్చుకుంటూ కివీస్ టాప్ ఆర్డర్‌ను దెబ్బతీసింది. ఓపెనర్ డెవాన్ కాన్వేను మాథ్యూ ఫిషర్ అవుట్ చేయగా, కెప్టెన్ టామ్ లాథమ్ (27) జెఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. కేన్ విలియమ్సన్ స్థానంలో మూడో నంబర్‌లో బరిలోకి దిగిన హెన్రీ నికోల్స్ (24) జోష్ టంగ్ బౌలింగ్‌లో అవుట్ కాగా, డీసెంట్ ఇన్నింగ్స్ ఆడిన రచిన్ రవీంద్ర (33) ఇంగ్లాండ్ అరంగేట్రం పేసర్ సన్నీ బేకర్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఈ దశలో బ్లండెల్, డారిల్ మిచెల్ (44) కలిసి ఐదో వికెట్‌కు 81 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. మిచెల్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన గ్లెన్ ఫిలిప్స్‌తో కలిసి బ్లండెల్ మరో 75 పరుగులు జోడించాడు.
ఈ సిరీస్‌లో న్యూజిలాండ్ తరఫున మొదటి హాఫ్ సెంచరీ నమోదు చేసిన బ్లండెల్.. ఆ వెంటనే ఇంగ్లాండ్ ఆల్రౌండర్ జాకబ్ బెథెల్ వేసిన స్లో డెలివరీకి షార్ట్ మిడ్‌వికెట్‌లో జో రూట్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆఖర్లో నాథన్ స్మిత్‌ను కూడా అవుట్ చేసిన బెథెల్ కేవలం 8 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లాండ్ తరఫున టెస్ట్ అరంగేట్రం చేసిన 23 ఏళ్ల హాంప్‌షైర్ ఫాస్ట్ బౌలర్ సన్నీ బేకర్ 63 పరుగులిచ్చి 2 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి గ్లెన్ ఫిలిప్స్ 49 పరుగులతో క్రీజులో ఉండటంతో మ్యాచ్ ప్రస్తుతం ఇరు జట్ల మధ్య సమంగా నిలిచింది.