T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ లో సంచలనం.. ఇటలీ తొలి విజయం
ఇటలీ తొలి విజయం
T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్‌లో ఒక సంచలనం నమోదైంది. గ్రూప్-సిలో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో నేపాల్‌పై ఇటలీ 10 వికెట్ల తేడాతో చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. వరల్డ్ కప్ చరిత్రలో ఇటలీకి ఇదే తొలి విజయం.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన నేపాల్, ఇటలీ బౌలర్ల ధాటికి 19.3 ఓవర్లలో కేవలం 123 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఆరిఫ్ షేక్ (27), రోహిత్ పౌడెల్ (23), ఆసిఫ్ షేక్ (20) పరుగులు చేశారు. ఒక దశలో 93/3తో పటిష్టంగా ఉన్న నేపాల్, ఆ తర్వాత కేవలం 30 పరుగుల వ్యవధిలో చివరి 7 వికెట్లను కోల్పోయి కుప్పకూలింది.ఇటలీ బౌలింగ్ లో క్రిషన్ కలుగమేజ్ 18 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి నేపాల్ పతనాన్ని శాసించాడు. ఇతనికి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. బెన్ మన్నెంటి 4 ఓవర్లలో కేవలం 9 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీసి అత్యంత పొదుపుగా బౌలింగ్ చేశాడు.
124 పరుగుల లక్ష్యాన్ని ఇటలీ కేవలం 12.4 ఓవర్లలోనే, వికెట్ నష్టపోకుండా ఛేదించింది. ఓపెనర్లుగా వచ్చిన అన్నదమ్ములు జస్టిన్ మోస్కా (60), ఆంథోనీ మోస్కా (62) అజేయ హాఫ్ సెంచరీలతో చెలరేగారు.
టీ20 వరల్డ్ కప్ చరిత్రలో అన్నదమ్ములు సెంచరీ భాగస్వామ్యం (124 పరుగులు) నెలకొల్పడం ఇదే మొదటిసారి. వీరు పాకిస్థాన్‌కు చెందిన అక్మల్ సోదరుల (కమ్రాన్, ఉమర్) పాత రికార్డును అధిగమించారు.