Shami Shines in Ranji Trophy: రంజీలో దుమ్మురేపుతున్న షమీ.. సౌతాఫ్రికా టెస్ట్‌కి దారి దొరుకుతుందా..?
సౌతాఫ్రికా టెస్ట్‌కి దారి దొరుకుతుందా..?
Shami Shines in Ranji Trophy: టీమ్‌ఇండియాలోకి రీ-ఎంట్రీ కోసం ఆశగా ఎదురుచూస్తున్న సీనియర్ పేసర్ మహ్మద్ షమీ రంజీ ట్రోఫీలో అద్భుతమైన ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. తనను ఫిట్‌నెస్ కారణంగా పక్కన పెడుతున్నారనే విమర్శలకు తన బంతితోనే సమాధానం చెప్తున్నాడు. బెంగాల్ తరఫున ఆడుతున్న 35 ఏళ్ల షమీ.. ఎలైట్ గ్రూప్-సిలో ఈడెన్ గార్డెన్స్ వేదికగా గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శనతో బెంగాల్ జట్టు గుజరాత్‌ను 141 పరుగుల తేడాతో ఓడించి వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఇంతకుముందు ఉత్తరాఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ షమీ ఏడు వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. కేవలం రెండు రంజీ మ్యాచ్‌ల్లోనే షమీ 15 వికెట్లు తీసి సెలక్టర్లకు గట్టి సందేశం పంపాడు!
సెలక్టర్లకు షమీ ప్రశ్న
ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత షమీ జాతీయ జట్టుకు ఎంపిక కాలేదు. ఫిట్‌నెస్ సమస్యల కారణంగానే అతడిని పక్కనపెడుతున్నారనే వాదన ఉంది. దీనిపై ఇటీవల షమీ సెలక్టర్లను బహిరంగంగానే ప్రశ్నించాడు. "రంజీ మ్యాచ్‌లు ఆడేందుకు సరిపోయే ఫిట్‌నెస్.. వన్డేలు ఆడటానికి సరిపోదా? అని నిలదీశాడు.
సఫారీ సిరీస్‌పై చూపు
క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఇప్పుడు షమీ వైపే చూస్తున్నారు. నవంబర్ 14 నుంచి సౌతాఫ్రికాతో భారత్ రెండు టెస్టులు ఆడనుంది. ఈ సిరీస్‌కు జట్టును త్వరలో ప్రకటించనున్నారు. రంజీలో షమీ చూపించిన ఈ అద్భుతమైన ఫామ్, పట్టుదల.. అతన్ని సౌతాఫ్రికాతో జరిగే టెస్టు సిరీస్‌కి ఎంపిక చేయాలని అభిమానులు గట్టిగా కోరుకుంటున్నారు. ఈడెన్‌లో నిప్పులు చెరిగిన షమీకి, ఈ టెస్ట్ సిరీస్‌లో చోటు దక్కుతుందో లేదో చూడాలి.