Sourav Ganguly: ఆరేళ్ల విరామం తర్వాత గంగూలీకి కీలక పదవి
గంగూలీకి కీలక పదవి
Sourav Ganguly: భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, ఆరేళ్ల విరామం తర్వాత మరోసారి బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం జరిగిన 94వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో గంగూలీ స్థానంలో అతని అన్న స్నేహాశిష్ గంగూలీ క్యాబ్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. స్నేహాశిష్ ఆరేళ్ల పదవీ కాలం పూర్తి కావడంతో సౌరవ్ గంగూలీ తిరిగి ఈ పదవిలోకి వచ్చారు. ఈ పదవి కోసం మరెవరూ నామినేషన్ వేయకపోవడంతో గంగూలీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే గంగూలీ కొన్ని కీలకమైన ప్రణాళికలను ప్రకటించారు. ప్రస్తుతం 68,000 ఉన్న ఈడెన్ గార్డెన్స్ స్టేడియం సామర్థ్యాన్ని లక్షకు పెంచాలని గంగూలీ యోచిస్తున్నారు. ఈ పని వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచ కప్ తర్వాత ప్రారంభమవుతుందని తెలిపారు. 2026లో జరగబోయే టీ20 ప్రపంచ కప్‌లో కొన్ని ముఖ్యమైన మ్యాచ్‌లను ఈడెన్ గార్డెన్స్‌కు రప్పించడం తన ప్రధాన లక్ష్యమని చెప్పారు. నవంబర్‌లో భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగే తొలి టెస్ట్ మ్యాచ్‌కి ఆతిథ్యం ఇవ్వడానికి ఈడెన్ గార్డెన్స్‌ను సిద్ధం చేయడంపై దృష్టి పెడతానని తెలిపారు. బెంగాల్ క్రికెట్ అభివృద్ధి కోసం 9 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక అకాడమీని నిర్మిస్తామని ప్రకటించారు. సౌరవ్ గంగూలీ ఇంతకు ముందు 2015 నుంచి 2019 వరకు క్యాబ్ అధ్యక్షుడిగా, ఆ తర్వాత 2019 నుంచి 2022 వరకు బీసీసీఐ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. తన సుదీర్ఘ అనుభవం బెంగాల్ క్రికెట్‌ను మరింత ముందుకు తీసుకెళ్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.