Sri Lanka Clinch Victory: తొలి వన్డేలో శ్రీలంక విజయం.. విండీస్‌పై 41 పరుగుల తేడాతో ఘన విజయం!

విండీస్‌పై 41 పరుగుల తేడాతో ఘన విజయం!

Update: 2026-06-04 08:30 GMT

Sri Lanka Clinch Victory: బుధవారం జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో శ్రీలంక జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా జరిగిన ఈ తొలి పోరులో వెస్టిండీస్‌ను 41 పరుగుల తేడాతో ఓడించి లంక జట్టు సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కెప్టెన్ కుశాల్ మెండిస్ (62 బంతుల్లో 72), ఓపెనర్ పాతుమ్ నిస్సాంక (103 బంతుల్లో 79) అద్భుతమైన హాఫ్ సెంచరీలతో రాణించడంతో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 303 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 304 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టు 49.2 ఓవర్లలో 262 పరుగులకే ఆలౌట్ అయింది. విండీస్ కెప్టెన్ షై హోప్ (66 బంతుల్లో 56) ఒంటరి పోరాటం చేసినప్పటికీ జట్టును విజేతగా నిలపలేకపోయారు.

టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన లంక జట్టుకు ఓపెనర్ పాతుమ్ నిస్సాంక గట్టి పునాది వేశారు. ఆయన నిలకడగా ఆడుతూ 79 పరుగులు చేయగా, కెప్టెన్ కుశాల్ మెండిస్ ధాటిగా ఆడుతూ 72 పరుగులతో విరుచుకుపడ్డారు. వీరిద్దరి వీరోచిత ఇన్నింగ్స్ కారణంగా శ్రీలంక బోర్డుపై భారీ స్కోరును ఉంచగలిగింది. వెస్టిండీస్ బౌలర్లలో మాథ్యూ ఫోర్డ్ (2/44), రోస్టన్ చేజ్ (2/49) రెండేసి వికెట్లు పడగొట్టారు.

అనంతరం భారీ లక్ష్య ఛేదనలో వెస్టిండీస్ బ్యాటర్లు శ్రీలంక బౌలింగ్ దాటికి క్రమంగా వికెట్లు కోల్పోయారు. కెప్టెన్ షై హోప్ 56 పరుగులు, జస్టిన్ గ్రీవ్స్ 45 పరుగులతో రాణించినప్పటికీ మిగిలిన ఆటగాళ్ల నుండి సరైన మద్దతు లభించలేదు. శ్రీలంక బౌలర్లలో ఫాస్ట్ బౌలర్ దుష్మంత చమీర విండీస్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతూ 4 వికెట్లు (4/67) పడగొట్టి ఇన్నింగ్స్ నడుము విరిచారు. మరోవైపు స్పిన్నర్ మహీష్ తీక్షణ తన 10 ఓవర్ల కోటాలో కేవలం 26 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టి విండీస్ పరుగుల వేగానికి బ్రేకులు వేశారు. చమీర, తీక్షణల అద్భుత బౌలింగ్ దాటికి వెస్టిండీస్ మరో 4 బంతులు మిగిలి ఉండగానే 262 పరుగుల వద్ద కుప్పకూలింది.

Tags:    

Similar News