Sri Lanka Cricket’s Sensational Decision: శ్రీలంక క్రికెట్ సంచలన నిర్ణయం

సంచలన నిర్ణయం

Update: 2025-11-13 05:57 GMT

Sri Lanka Cricket’s Sensational Decision: పాకిస్తాన్‌లో జరుగుతున్న వన్డే సిరీస్‌ను తమ ఆటగాళ్లు కొనసాగించాలని శ్రీలంక క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. ఇస్లామాబాద్‌లో జరిగిన ఆత్మాహుతి దాడి తర్వాత పలువురు ఆటగాళ్లు భద్రతా కారణాల దృష్ట్యా స్వదేశానికి తిరిగి రావాలని కోరిన నేపథ్యంలో బోర్డు ఈ సంచలన ఆదేశాలు జారీ చేసింది. పర్యటనను మధ్యలో వదిలిపెట్టి స్వదేశానికి వచ్చే ఏ ఆటగాడైనా లేదా సహాయక సిబ్బంది అయినా, వారిపై అధికారిక సమీక్షనిర్వహించి తగిన నిర్ణయం తీసుకుంటామని బోర్డు కఠినంగా హెచ్చరించింది. బోర్డు ఆదేశాలను ధిక్కరించి ఎవరైనా తిరిగి వస్తే, సిరీస్‌కు అంతరాయం కలగకుండా ఉండేందుకు వెంటనే వారి స్థానంలో కొత్త ఆటగాళ్లను పంపుతామని ఒక ప్రకటనలో తెలిపింది. "పర్యటనలో ఉన్న ప్రతి సభ్యుడి భద్రత, క్షేమం మాకు అత్యంత ప్రాధాన్యత అని బోర్డు నొక్కి చెప్పింది, అలాగే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ అన్ని భద్రతా ఆందోళనలను పరిష్కరిస్తున్నట్లు హామీ ఇచ్చింది. రావల్పిండిలో మంగళవారం శ్రీలంక-పాకిస్తాన్ మధ్య తొలి వన్డే మ్యాచ్ జరగడానికి కొద్ది గంటల ముందు, సమీపంలోని ఇస్లామాబాద్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 12 మంది మరణించారు, 27 మంది గాయపడ్డారు. ఈ సంఘటనతోనే ఆటగాళ్లలో భయాందోళనలు మొదలయ్యాయి. దీంతో కొంతమంది ఆటగాళ్లు వెంటనే ఇంటికి తిరిగి వెళ్లాలని కోరినట్లు జట్టు నిర్వహణ బోర్డుకు తెలియజేసింది. పాకిస్తాన్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు దాదాపు పదేళ్ల పాటు విరామం ఏర్పడటానికి కారణమైన 2009 నాటి శ్రీలంక జట్టు బస్సుపై జరిగిన ఉగ్రదాడి జ్ఞాపకాలు ఈ తాజా సంఘటనతో మళ్లీ గుర్తుకు వచ్చాయి. ఈ ఘటన నేపథ్యంలో, PCB చైర్మన్ మొహసిన్ నఖ్వీ, శ్రీలంక ఆటగాళ్లను ఇస్లామాబాద్ హోటల్‌లో కలిసి, వారి భద్రతకు పూర్తి హామీని ఇచ్చారు. పాకిస్తాన్‌లోని ఉన్నతాధికారులు శ్రీలంక బృందానికి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ధృవీకరించారు. రెండవ వన్డే శుక్రవారం, నవంబర్ 14న, మూడవ వన్డే ఆదివారం, నవంబర్ 16న రావల్పిండిలో జరగనున్నాయి.

Tags:    

Similar News