Cricket Coach Sumith Fernando: శ్రీలంకకు చెందిన 62 ఏళ్ల ప్రముఖ క్రికెట్ కోచ్ సుమిత్ ఫెర్నాండో, కొలంబోలోని ఒక క్రికెట్ క్లబ్‌లో ఆటగాళ్లతో జరిగిన ఘర్షణ అనంతరం మరణించారు. లంక జాతీయ వన్డే జట్టు కెప్టెన్ కుసాల్ మెండిస్‌తో సహా ఎంతోమంది ప్రముఖ పాఠశాల స్థాయి క్రికెటర్లకు ఆయన శిక్షణ ఇచ్చారు. ఆయన అంత్యక్రియలు గురువారం నిర్వహించబడ్డాయి.

మొరాటువాలోని ప్రిన్స్ ఆఫ్ వేల్స్ కాలేజ్ మాజీ కోచ్ అయిన ఫెర్నాండో, ఆగస్టు 8న బ్లూమ్‌ఫీల్డ్ క్రికెట్ అండ్ అథ్లెటిక్ క్లబ్‌లో జరిగిన సంఘటన తర్వాత కొలంబో నేషనల్ హాస్పిటల్‌లో చేరారు. చికిత్స పొందుతూ ఆయన ఆగస్టు 10న కన్నుమూశారు. ఈ సంఘటనకు సంబంధించి సోమవారం నాడు పోలీసులు 17 ఏళ్ల పాఠశాల క్రికెటర్‌ను అరెస్టు చేశారు. ఆగస్టు 11న సదరు బాలుడిని కొలంబో మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా, ఆగస్టు 17 వరకు ఆ బాలుడిని ప్రొబేషన్ అండ్ చైల్డ్‌కేర్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ సంరక్షణలో ఉంచాలని కోర్టు ఆదేశించింది.

ప్రాథమిక దర్యాప్తు వివరాల ప్రకారం.. బ్లూమ్‌ఫీల్డ్‌లో శిక్షణ పొందుతున్న కొంతమంది క్రికెటర్ల బృందం నీటి కుళాయి (వాటర్ ట్యాప్) వద్దకు వెళ్లగా, అక్కడ నీళ్లు రాకపోవడంతో సమస్య మొదలైంది. ఈ క్రమంలో క్లబ్‌లో ఉద్యోగిగా పనిచేస్తున్న ఫెర్నాండోకు, ఆటగాళ్లకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ గొడవలో ఫెర్నాండో ఒక ఆటగాడిపై దాడికి ప్రయత్నించగా, ప్రతిగా 17 ఏళ్ల బాలుడు ఆయనపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. దెబ్బతిన్న ఫెర్నాండోను వెంటనే ఆసుపత్రికి తరలించారు.

అయితే ఆయన మరణానికి గల ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఫెర్నాండోకు గతంలోనే గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్లు వైద్య రికార్డులు సూచించడంతో, ఆయన మృతికి ఈ దాడే కారణమా లేక గుండెజబ్బు ప్రధాన కారణమా అనేది తేల్చేందుకు అధికారులు పోస్ట్‌మార్టం పరీక్ష నిర్వహించారు. జుడీషియల్ మెడికల్ ఆఫీసర్ ఓపెన్ వెర్డిక్ట్ (అనిశ్చిత తీర్పు) ఇవ్వగా, తదుపరి విశ్లేషణ కోసం శరీర కణజాల నమూనాలను (టిష్యూ శాంపిల్స్) గవర్నమెంట్ ఎనలిస్ట్‌కు పంపినట్లు స్థానిక మీడియా పేర్కొంది.

మొరాటువా నివాసి అయిన సుమిత్ ఫెర్నాండోకు క్రికెట్‌తో సుదీర్ఘ అనుబంధం ఉంది. కోచింగ్‌తో పాటు ఆయన బ్లూమ్‌ఫీల్డ్ క్రికెట్ & అథ్లెటిక్ క్లబ్‌ క్యూరేటర్‌గా కూడా సేవలు అందించారు.

Tags: