India–Pakistan Match: భారత్-పాకిస్తాన్ హై-వోల్టేజ్ మ్యాచ్‌పై సస్పెన్స్

హై-వోల్టేజ్ మ్యాచ్‌పై సస్పెన్స్

Update: 2026-02-09 07:50 GMT

India–Pakistan Match: ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరగాల్సిన భారత్-పాకిస్తాన్ హై-వోల్టేజ్ టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌పై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌ను బహిష్కరించాలన్న గత నిర్ణయంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) వచ్చే 24 గంటల్లో తుది ప్రకటన చేయనుంది. లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియంలో ఐసీసీ (ICC) ఉన్నతాధికారులు మరియు పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ మధ్య జరిగిన ఐదు గంటల సుదీర్ఘ చర్చల అనంతరం ఈ పరిణామం చోటుచేసుకుంది.

భారత్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు బంగ్లాదేశ్ నిరాకరించడంతో ఐసీసీ ఆ జట్టును టోర్నీ నుంచి తొలగించి స్కాట్లాండ్‌ను చేర్చింది. ఈ నిర్ణయానికి నిరసనగా, బంగ్లాదేశ్‌కు మద్దతుగా భారత్‌తో ఫిబ్రవరి 15న జరగాల్సిన మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేస్తున్నట్లు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది.

ఈ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ఐసీసీ డెప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖవాజా, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ (BCB) అధ్యక్షుడు అమీనుల్ ఇస్లాం లాహోర్ చేరుకున్నారు.ఐసీసీ రెవెన్యూలో వాటా పెంపు, భారత్‌తో ద్వైపాక్షిక సిరీస్‌ల పునరుద్ధరణ వంటి డిమాండ్లను పీసీబీ ఐసీసీ ముందు ఉంచినట్లు సమాచారం. మ్యాచ్‌ను బహిష్కరిస్తే పీసీబీ భారీ ఆర్థిక జరిమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, ఐసీసీ నుండి అందే వార్షిక నిధులు కూడా తగ్గే ప్రమాదం ఉందని ఐసీసీ హెచ్చరించింది. ఈ చర్చల సారాంశాన్ని మొహ్సిన్ నఖ్వీ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు వివరించి, ప్రభుత్వ అనుమతితో తుది నిర్ణయం తీసుకోనున్నారు.

ప్రస్తుతానికి ఐసీసీ ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్ల విక్రయాలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఒకవేళ పాకిస్తాన్ వెనక్కి తగ్గకపోతే, భారత్‌కు వాకోవర్ ద్వారా పాయింట్లు లభిస్తాయి. అయితే, టోర్నమెంట్ వాణిజ్య ప్రయోజనాల దృష్ట్యా ఐసీసీ ఈ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించే ప్రయత్నం చేస్తోంది.

Tags:    

Similar News