T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్‌లో అభిషేక్ శర్మ చెత్త రికార్డు!

అభిషేక్ శర్మ చెత్త రికార్డు!

Update: 2026-02-19 01:59 GMT

T20 World Cup 2026: అహ్మదాబాద్‌ వేదికగా బుధవారం నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్, ప్రపంచ నంబర్ 1 టీ20 బ్యాటర్ అభిషేక్ శర్మ తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లో కనీసం ఖాతా తెరవకుండానే డకౌట్‌గా వెనుదిరిగిన అభిషేక్, తన పేరిట ఒక అవాంఛనీయ రికార్డును లిఖించుకున్నాడు. ఇన్నింగ్స్ మూడో బంతికే స్పిన్నర్ ఆర్యన్ దత్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ కావడంతో స్టేడియంలోని అభిమానులంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

టీ20 ప్రపంచకప్‌లో తను ఆడిన మొదటి మూడు మ్యాచ్‌ల్లోనూ వరుసగా సున్నా పరుగులకే అవుట్ కావడం విశేషం. దీంతో అంతర్జాతీయ స్థాయిలో ఉగాండా ఆటగాడు రోజర్ ముకాసా తర్వాత, కెరీర్ మొదటి మూడు వరల్డ్ కప్ మ్యాచ్‌ల్లోనూ 'డకౌట్' అయిన రెండో బ్యాటర్‌గా అభిషేక్ నిలిచాడు. రోజర్ ముకాసా 2024 ప్రపంచకప్‌లో వరుసగా మూడు సార్లు సున్నాకే వెనుదిరగగా, ఇప్పుడు అభిషేక్ కూడా అదే బాటలో పయనించడం చర్చనీయాంశంగా మారింది. భారత మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా కూడా వరల్డ్ కప్‌లో మూడు వరుస డకౌట్లు నమోదు చేసినప్పటికీ, అవి వేర్వేరు సంవత్సరాల్లో (2010, 2016) జరగడం గమనార్హం.

ఈ టోర్నీలో అభిషేక్ ప్రస్థానం ఏమాత్రం ఆశాజనకంగా సాగడం లేదు. ఫిబ్రవరి 7న అమెరికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో గోల్డెన్ డకౌట్ (తొలి బంతికే అవుట్) అయిన అతను, అనారోగ్యం కారణంగా నమీబియాతో మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఆ తర్వాత పాకిస్థాన్‌తో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో పునరాగమనం చేసినప్పటికీ, సల్మాన్ అలీ ఆఘా బౌలింగ్‌లో కేవలం నాలుగు బంతులు ఆడి మళ్ళీ సున్నాకే వెనుదిరిగాడు. ఇప్పుడు నెదర్లాండ్స్‌పై కూడా అదే ప్రదర్శనను పునరావృతం చేశాడు.

ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక డకౌట్లు సాధించిన ప్రపంచ రికార్డు పాకిస్థాన్‌కు చెందిన సయిమ్ అయూబ్ పేరిట ఉంది. అయూబ్ 2025లో ఏడుసార్లు సున్నాకే అవుట్ అయ్యాడు. అభిషేక్ శర్మ ప్రస్తుత ఫామ్ చూస్తుంటే, అతను త్వరగా పుంజుకోకపోతే జట్టులో తన స్థానానికే ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. ప్రపంచ నంబర్ 1 హోదాలో ఉండి ఇలా వరుసగా విఫలం కావడం సోషల్ మీడియాలో విమర్శలకు దారితీస్తోంది.

Tags:    

Similar News