Sree Charani: ప్రపంచ నెంబర్ 1 బౌలర్‌గా తెలుగమ్మాయి శ్రీచరణి..
తెలుగమ్మాయి శ్రీచరణి..
Sree Charani: మన తెలుగమ్మాయి.. ప్రపంచ క్రికెట్ శిఖరాగ్రాన నిలిచింది. భారత్ స్పిన్నర్, మన తెలుగు తేజం శ్రీచరణి అంతర్జాతీయ క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఐసీసీ ప్రకటించిన తాజా మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో... ప్రపంచ నెంబర్ 1 ఉమెన్ టీ20 బౌలర్‌గా అవతరించి రికార్డులకెక్కింది.
ఇప్పటివరకు అగ్రస్థానంలో కొనసాగుతున్న ఇంగ్లాండ్ స్టార్ స్పిన్నర్ లిన్సే స్మిత్‌ను వెనక్కి నెట్టి... శ్రీచరణి నెంబర్ వన్ సింహాసనాన్ని కైవసం చేసుకుంది. అతి తక్కువ కాలంలోనే ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్‌గా నిలిచి.. భారత క్రికెట్ కీర్తి పతాకాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎగురవేసింది.
శ్రీచరణి ఈ అద్భుతమైన ఫామ్‌కు.. తాజా టీ20 ప్రపంచకప్‌లో ఆమె కనబరిచిన విశ్వరూపమే కారణం. ఈ మెగా టోర్నమెంట్‌లో కేవలం మూడు మ్యాచ్‌లు ఆడిన శ్రీచరణి.. ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పతిప్పలు పెడుతూ ఏకంగా 10 వికెట్లు పడగొట్టింది! వికెట్ల వేటలో సునామీ సృష్టిస్తూ.. టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించింది. ఆమె స్పిన్ మాయాజాలానికి ప్రపంచ మేటి బ్యాటర్లు సైతం చేతులెత్తేశారు.
నిజానికి శ్రీచరణి అంతర్జాతీయ క్రికెట్ ప్రయాణం మొదలై ఎంతో కాలం కాలేదు. గతేడాది జూన్ 28న ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా ఆమె అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌లోకి అడుగుపెట్టింది. అరంగేట్రం చేసిన ఏడాది కాలంలోనే.. అంచలంచెలుగా ఎదుగుతూ, ప్రపంచ నెంబర్ 1 స్థానాన్ని అందుకోవడం ఆమె అసాధారణ ప్రతిభకు నిదర్శనం.
ఒక తెలుగు అమ్మాయి, అంతర్జాతీయ క్రికెట్ వేదికపై ఇంతటి ఘనత సాధించడం తెలుగువారందరికీ గర్వకారణం. రాబోయే రోజుల్లో శ్రీచరణి మరిన్ని రికార్డులు బద్దలు కొట్టాలని, భారత జట్టుకు మరిన్ని విజయాలు అందించాలని కోరుకుందాం.