Neeraj Chopra: గత10 నెలలు నా సహనానికి పెద్ద పరీక్షగా నిలిచాయి: నీరజ్
నీరజ్
Neeraj Chopra: భారత స్టార్ జావెలిన్ త్రోయర్, ఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్రా తన కెరీర్‌లోని అత్యంత కఠినమైన కాలం గురించి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. గడచిన పది నెలలు తన జీవితంలో అత్యంత క్లిష్టంగా సాగాయని, ఈ కాలం తన సహనానికి ఊహించని రీతిలో పరీక్ష పెట్టిందని ఆయన పేర్కొన్నారు. గాయాల బారిన పడటం, వాటి నుంచి పూర్తిగా కోలుకుని శరీరాన్ని తిరిగి పూర్వపు స్థితికి తెచ్చుకోవడానికే తనకు ఎక్కువ సమయం పట్టిందని నీరజ్ తెలిపారు.
పోటీల్లో పాల్గొనాలని తీవ్రంగా తపించినప్పటికీ, లయను కోల్పోవడం,మళ్లీ ఆమ్‌టోమ్‌కు రావడం ఎంత కష్టమో ఈ కాలంలో తాను నేర్చుకున్నానని నీరజ్ వివరించారు. ఈ ఏడాది అసలు పోటీల్లో పాల్గొనే అవకాశం దొరుకుతుందో లేదోనన్న సందిగ్ధత ఉన్నప్పటికీ, ప్రతిరోజూ క్రమం తప్పకుండా శిక్షణను మాత్రం ఆపలేదని వెల్లడించారు. ముఖ్యంగా గ్లాస్గో గేమ్స్‌లో ప్రతికూల వాతావరణం, గాలి పరిస్థితులు కఠినంగా ఉన్నప్పటికీ, తన వెన్నంటి ఉండి ప్రోత్సహించిన సహాయక సిబ్బంది, కోచింగ్ టీమ్ సహకారంతోనే తాను మళ్లీ పుంజుకోగలిగానని కృతజ్ఞతలు తెలిపారు.
ఈ స్థాయిలో మళ్లీ అంతర్జాతీయ పోటీల్లో బరిలోకి దిగడం తనకు ఎంతో సంతోషాన్నిస్తోందని నీరజ్ చోప్రా ఆనందం వ్యక్తం చేశారు. కేవలం తన స్వశక్తితోనే ఇది సాధ్యం కాలేదని, తనపై అచంచలమైన నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరికీ, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. అడ్డంకులను ఎదుర్కొని మరింత దృఢంగా తిరిగొచ్చిన నీరజ్ చోప్రా, రాబోయే టోర్నమెంట్‌లలోనూ దేశానికి మరిన్ని పతకాలు సాధించిపెట్టాలనే కసితో ముందుకు సాగుతున్నారు.