Cheteshwar Pujara: నా క్రికెట్ కెరీర్‌లో నేను ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బౌలర్లు వీళ్లే : పుజారా

అత్యంత కఠినమైన బౌలర్లు వీళ్లే : పుజారా;

Update: 2025-08-26 13:58 GMT

Cheteshwar Pujara: అంతర్జాతీయ క్రికెట్‌లో 14 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత చతేశ్వర్ పుజారా (ఆగస్టు 24) రిటైర్మెంట్ ప్రకటించారు. దాదాపు రెండు దశాబ్దాల పాటు ప్రొఫెషనల్ క్రికెట్ ఆడిన తర్వాత తన రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని ఆయన సోషల్ మీడియాలో ప్రకటించారు. ముఖ్యంగా టెస్ట్ స్పెషలిస్ట్‌గా తనను తాను ప్రత్యేకంగా గుర్తించుకున్నారు. భారత క్రికెట్‌లో ఒకప్పుడు రాహుల్ ద్రవిడ్ ఎలాగైతే టెస్ట్ మ్యాచ్‌లలో ప్రత్యర్థులకు గట్టి అడ్డుగోడలా నిలిచేవారో, అదే విధంగా పుజారా కూడా "నయా వాల్" గా పేరు పొందారు. క్రీజులో పాతుకుపోయి, ఎంత ఒత్తిడి ఉన్నా వికెట్ కోల్పోకుండా, బౌలర్లను అలసిపోయేలా చేసే అరుదైన నైపుణ్యం పుజారా సొంతం.

100 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన 13 మంది భారతీయ ఆటగాళ్లలో ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ ఒకరు. రిటైర్మెంట్ తీసుకునే ముందు అతను మొత్తం 104 మ్యాచ్‌లు ఆడాడు. వీటిలో, అతను 19 సెంచరీలు సాధించాడు. 43.60 సగటుతో 7195 పరుగులు చేశాడు.2018-19 ఆస్ట్రేలియా పర్యటనలో చారిత్రాత్మక టెస్ట్ సిరీస్ విజయంలో పుజారా కీలక పాత్ర పోషించాడు. ఆ సిరీస్‌లో మొత్తం 521 పరుగులు చేసి, "ప్లేయర్ ఆఫ్ ది సిరీస్" అవార్డు గెలుచుకున్నాడు. ఒక టెస్ట్ సిరీస్‌లో 1258 బంతులు ఎదుర్కొని ఈ రికార్డు సాధించాడు. ఒక టెస్ట్ ఇన్నింగ్స్‌లో 500కి పైగా బంతులు ఎదుర్కొన్న ఏకైక భారత బ్యాట్స్‌మెన్ పుజారానే. 2017లో ఆస్ట్రేలియాపై రాంచీలో జరిగిన మ్యాచ్‌లో అతను ఈ అద్భుత రికార్డు సాధించాడు.

తన రిటైర్మెంట్ తర్వాత మాట్లాడుతూ, పుజారా తన కెరీర్‌లో ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బౌలర్ల పేర్లను పేర్కొన్నాడు. 37 ఏళ్ల పుజారా తాను ఎదుర్కొన్న అత్యంత కఠినమైన నలుగురు బౌలర్ల పేర్లను పేర్కొన్నాడు. అతను ఏ స్పిన్నర్లనూ ప్రస్తావించలేదు. దక్షిణాఫ్రికా పేసర్లు డేల్ స్టెయిన్, మోర్న్ మోర్కెల్, ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమ్మిన్స్, ఇంగ్లాండ్ మాజీ పేసర్ జేమ్స్ ఆండర్సన్ పేర్లను పేర్కొన్నాడు. తన అద్భుతమైన కెరీర్‌లో తాను ఆడిన అన్ని కెప్టెన్‌లను ప్రశంసించాడు.

అంతర్జాతీయ క్రికెట్‌ కంటే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోనే పుజారా తన అద్భుతమైన ఫామ్‌ను నిరూపించుకున్నాడు. అతను 278 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 21,301 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. ఇందులో 66 సెంచరీలు మరియు 81 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అతని అత్యధిక స్కోరు 352 పరుగులు.

Tags:    

Similar News