Anaya Bangar: క్రికెట్లోకి ట్రాన్స్ జెండర్ అనాయా బంగార్ రీఎంట్రీ
అనాయా బంగార్ రీఎంట్రీ
Anaya Bangar: క్రీడా ప్రపంచంలో ఓ సరికొత్త చరిత్ర! లింగ మార్పిడి శస్త్రచికిత్స కారణంగా ఆటకు దూరమైన మాజీ క్రికెటర్ సంతానం.. ఇప్పుడు రీఎంట్రీకి సిద్ధమయ్యారు. భారత మాజీ క్రికెటర్, ప్రముఖ కోచ్ సంజయ్ బంగార్ సంతానమైన అనాయా బంగార్‌కు.. క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి రీఎంట్రీకి అధికారికంగా గ్రీన్ సిగ్నల్ లభించింది.
గతంలో పురుషుల క్రికెట్ ఆడిన అనాయా బంగార్, జెండర్-అఫర్మింగ్ సర్జరీ (లింగ మార్పిడి శస్త్రచికిత్స) తర్వాత మహిళల క్రికెట్‌లో ఆడేందుకు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఆమెకు క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి కీలకమైన అనుమతులు లభించాయి. దీని ప్రకారం ఆస్ట్రేలియాలో జరిగే ఉమెన్స్ ప్రీమియర్ క్రికెట్ పోటీలు, అలాగే ఇతర కమ్యూనిటీ క్రికెట్ మ్యాచ్‌లలో అనాయా వెంటనే బరిలోకి దిగేందుకు అర్హత సాధించారు.
అయితే, ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్ (WBBL) లాంటి ఎలైట్ ప్రొఫెషనల్ టోర్నమెంట్‌లలో ఆడాలంటే మాత్రం కొన్ని నిబంధనలు వర్తిస్తాయి. క్రికెట్ ఆస్ట్రేలియా మార్గదర్శకాల ప్రకారం.. బ్లడ్ టెస్టుల్లో టెస్టోస్టెరాన్ స్థాయిలు నిర్దిష్ట పరిమితికి లోబడి ఉండాల్సి ఉంటుంది. ఈ నిబంధనలకూ కట్టుబడి ఉండేలా ఆమె కసరత్తు చేస్తున్నారు. ఈ మార్గదర్శకాల ప్రకారం అనాయా బంగార్.. మార్చి 2027 నాటికి ఎలైట్ ఉమెన్స్ క్రికెట్‌లోనూ పూర్తిస్థాయిలో ఆడేందుకు అర్హత సాధించనున్నారు.
ఈ పరిణామం పట్ల అనాయా బంగార్ ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. క్రీడల్లో ట్రాన్స్‌జెండర్ అథ్లెట్ల భాగస్వామ్యం, నిబంధనల పరంగా ఇదొక మైలురాయిగా నిలుస్తుందని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కఠిన సవాళ్లను ఎదుర్కొంటూ, తనకిష్టమైన క్రికెట్ మైదానంలోకి మళ్లీ అడుగుపెట్టబోతున్న అనాయా బంగార్‌కు క్రీడా లోకం నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.