Tri-Nation ODI Series: ముక్కోణపు వన్డే సిరీస్: ఇండియా-ఎకు వరుసగా రెండో పరాజయం.
ఇండియా-ఎకు వరుసగా రెండో పరాజయం.
Tri-Nation ODI Series: ముక్కోణపు వన్డే సిరీస్‌లో ఇండియా–ఎ జట్టుకు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. మంగళవారం శ్రీలంక-ఎ జట్టుతో జరిగిన ఉత్కంఠ భరిత పోరులో.. టీమిండియా తృటిలో విజయాన్ని చేజార్చుకుంది. సూపర్ ఓవర్‌కు దారితీసిన ఈ హై-డ్రామా మ్యాచ్‌లో చివరకు లంక జట్టునే విజయం వరించింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా-ఎ జట్టు.. లంక బౌలర్ల ధాటికి తడబడింది. టాప్ ఆర్డర్ దారుణంగా ఫెయిలవడంతో ఒక దశలో 143 రన్స్‌కే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ప్రభ్‌సిమ్రన్ సింగ్ 11, వైభవ్ సూర్యవంశీ 21, తిలక్ వర్మ 23, రుతురాజ్ గైక్వాడ్ 37 పరుగులకే వెనుదిరిగారు. అయితే, ఈ కష్టసమయంలో సూర్యాన్ష్ షెడ్గే, విప్రాజ్ నిగమ్ అద్భుత పోరాటాన్ని కనబరిచారు. ఎనిమిదో వికెట్‌కు ఏకంగా 104 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. సూర్యాన్ష్ 72 రన్స్, విప్రాజ్ 51 రన్స్‌తో హాఫ్ సెంచరీలతో రాణించడంతో.. ఇండియా 49.2 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటైంది.
అనంతరం 266 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక-ఎ జట్టు కూడా గట్టిగానే పోరాడింది. సాదిరా సమరవిక్రమ 93 రన్స్‌తో లంకను విజయతీరాలకు చేర్చే ప్రయత్నం చేశాడు. అయితే మన బౌలర్లు కట్టడి చేయడంతో.. శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు సరిగ్గా 265 రన్స్ చేసింది. దీంతో మ్యాచ్ ఉత్కంఠభరితంగా టై అయింది. అయితే, అసలు డ్రామా సూపర్ ఓవర్ సందర్భంగా జరిగింది. ఈ క్రమంలో ఇరుజట్ల ఆటగాళ్ల మధ్య మైదానంలో తోపులాట జరగడంతో కాసేపు తీవ్ర గందరగోళం నెలకొంది.
ఇక సూపర్ ఓవర్ లో మొదట బౌలింగ్ చేసిన ఇండియా బౌలర్ అర్షద్ ఖాన్.. ఒక వైడ్‌తో కలిపి భారీగా 16 రన్స్ ఇచ్చుకున్నాడు. ఆ తర్వాత 17 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. కేవలం 9 రన్స్‌కే పరిమితం కావడంతో లంక విజయం సాధించింది. లంక జట్టులో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన సమరవిక్రమకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.