Under-19 World Cup 2026: అండర్ 19 వరల్డ్ కప్ : ఇండియా ,ఇంగ్లాండ్ ఫైనల్ పోరు
ఇండియా ,ఇంగ్లాండ్ ఫైనల్ పోరు
Under-19 World Cup 2026: ఇవాళ జింబాబ్వేలోని హరారేలో ఇండియా vs ఇంగ్లాండ్ మధ్య అండర్-19 వరల్డ్ కప్ 2026 ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. భారత కుర్రాళ్లు వరుసగా ఆరోసారి ఫైనల్‌కు చేరుకుని రికార్డు సృష్టించారు. మధ్యాహ్నం ఒంటిగంటకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.భారత్ ఇప్పటికే 5 సార్లు (2000, 2008, 2012, 2018, 2022) ఛాంపియన్‌గా నిలిచింది. ఈరోజు గెలిస్తే 6వ సారి టైటిల్ సాధించి తన రికార్డును మరింత పటిష్టం చేసుకుంటుంది.
టీమ్ ఇండియా కెప్టెన్ ఆయుష్ మ్హత్రే నాయకత్వంలో భారత్ ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్‌కు దూసుకొచ్చింది. సెమీఫైనల్‌లో అఫ్గానిస్థాన్‌పై 311 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి చరిత్ర సృష్టించింది. థామస్ రే నాయకత్వంలోని ఇంగ్లాండ్ జట్టు సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్‌కు చేరింది.
భారత కీలక ఆటగాళ్లు వైభవ్ సూర్యవంశీ కేవలం 14 ఏళ్ల వయసులోనే ఈ టోర్నీలో అత్యధిక సిక్సర్లు, మూడు హాఫ్ సెంచరీలు బాది అదరగొడుతున్నాడు. ఆరోన్ జార్జ్ సెమీఫైనల్‌లో సెంచరీతో జట్టును గెలిపించిన స్టార్ బ్యాటర్. మరోవైపు ఇంగ్లండ్‌ను కూడా తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండా ఫైనల్‌కు వచ్చారు. ఈ టోర్నీలో ఇంగ్లాండ్ తరపున అత్యధిక పరుగులు బెన్ మేయెస్ , వికెట్లు తీసిన ఆటగాడు మ్యానీ లుమ్స్‌డెన్ చెలరేగితే ఇండియాకు కష్టాలు తప్పవు. భారత యువ జట్టు మరోసారి వరల్డ్ కప్ ముద్దాడాలని కోరుకుందాం! ఆల్ ది బెస్ట్ టీమ్ ఇండియా.