Vaibhav Suryavanshi Gives: బ్యాట్‌లో ఏఐ చిప్?..వైభవ్ సూర్యవంశీ దిమ్మతిరిగే కౌంటర్

వైభవ్ సూర్యవంశీ దిమ్మతిరిగే కౌంటర్

Update: 2026-04-30 02:42 GMT

Vaibhav Suryavanshi Gives: ఐపీఎల్ అంటేనే రికార్డుల వేట.. ఐపీఎల్ అంటేనే సంచలనాలకు కేరాఫ్ అడ్రస్. కానీ ఈ 2026 సీజన్ మాత్రం ఒకే ఒక్క పేరుతో మారుమోగిపోతోంది. అతడే.. 15 ఏళ్ల వయసున్న క్రికెట్ వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ. క్రీజులోకి అడుగుపెడితే చాలు.. బౌలర్ ఎవరన్నది చూడడు, బంతి ఎక్కడ పడిందన్నది పట్టించుకోడు.. కేవలం బౌండరీలే లక్ష్యంగా విరుచుకుపడుతున్నాడు. ఇటీవల సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై కేవలం 36 బంతుల్లోనే సెంచరీ బాది క్రికెట్ లోకాన్ని తనవైపు తిప్పుకున్నాడీ యువకిరణం. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లోనే ఏకంగా 400 పరుగులు చేసి, టాప్ బ్యాటర్‌గా దూసుకుపోతున్నాడు.

సూర్యవంశీ బ్యాటింగ్ ధాటికి దిగ్గజ క్రికెటర్లే నోరెళ్లబెడుతుంటే.. కొందరికి మాత్రం అది మింగుడుపడటం లేదు. ముఖ్యంగా పాకిస్థాన్‌కు చెందిన క్రికెట్‌ విశ్లేషకుడు నౌమాన్ నియాజ్, వైభవ్ సూర్యవంశీ ప్రతిభపై నీలినీడలు కప్పే ప్రయత్నం చేశాడు. ఎలాంటి ఆధారాలు లేకుండానే, వైభవ్ వాడే బ్యాట్‌లో ఏదో 'ఏఐ చిప్' (AI Chip) ఉందని, అందుకే అంత వేగంగా ఆడుతున్నాడని అర్థం పర్థం లేని ఆరోపణలు చేశాడు. అసూయతో చేసిన ఈ విమర్శలు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపాయి.

అయితే తన వయసు 15 ఏళ్లే కావచ్చు.. కానీ తన సమాధానం మాత్రం ప్రపంచ స్థాయి బ్యాటర్లకు మించి ఉంది. మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ ముగిసిన తర్వాత, ఈ ఏఐ చిప్ ఆరోపణలపై వైభవ్ స్పందించాడు. నా బ్యాట్‌లో ఏదో చిప్ ఉందని అంటున్నారు.. కానీ నిజానికి ఆ దేవుడే నా బ్యాట్‌లో ఏదో పెట్టాడు. నీ బ్యాట్‌తో నువ్వు అద్భుతాలు చేస్తావని భగవంతుడు పైనుంచి ముందే చెప్పాడు.. నేను అదే నమ్ముతూ ఆడుతున్నాను" అంటూ తన బ్యాటింగ్ పవర్‌కు దైవబలమే కారణమని గట్టిగా కౌంటర్ ఇచ్చాడు.

వైభవ్ ఇచ్చిన ఈ దిమ్మతిరిగే సమాధానానికి సంబంధించిన వీడియోను రాజస్థాన్ రాయల్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. చిన్న వయసులోనే ఇంతటి పరిణతితో విమర్శల నోళ్లు మూయించిన వైభవ్‌ను నెటిజన్లు పొగుడుతున్నారు.

Tags:    

Similar News