Varun Chakravarthy: టీమిండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి మరోసారి గాయం కావడంతో అఫ్గానిస్థాన్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు దూరమైనట్లు సమాచారం. ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో వరుణ్ తన పూర్తి కోటా నాలుగు ఓవర్లు బౌలింగ్ చేశాడు. మ్యాచ్ అనంతరం నిర్వహించిన ఎంఆర్ఐ స్కాన్‌లో అతడికి సైడ్ స్ట్రెయిన్ ఉన్నట్లు గుర్తించినట్టు తెలుస్తోంది. దీంతో ఈ నెలలోనే జరగనున్న ఆసియా క్రీడల్లోనూ వరుణ్ పాల్గొనడంపై సందేహాలు నెలకొన్నాయి.

గత కొన్ని నెలలుగా వరుణ్ చక్రవర్తి వరుస గాయాలతో ఇబ్బంది పడుతున్నాడు. 2026 ఐపీఎల్‌లో పాదానికి బంతి బలంగా తగలడంతో అతడికి గాయం అయింది. నొప్పి ఉన్నప్పటికీ కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున వరుణ్ మ్యాచ్‌లు ఆడాడు. అనంతరం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో పునరావాసం పొందాడు. దీంతో ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు.

ఆ తర్వాత ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో వరుణ్ తిరిగి జట్టులోకి వచ్చాడు. అయితే మూడో మ్యాచ్ అనంతరం హ్యామ్‌స్ట్రింగ్ సమస్య కారణంగా మళ్లీ సిరీస్‌కు దూరమై సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు వెళ్లాల్సి వచ్చింది. ఆగస్టులో తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో ఓ మ్యాచ్ ఆడిన అనంతరం ప్రస్తుత అఫ్గానిస్థాన్ సిరీస్‌కు ఎంపికయ్యాడు. తొలి మ్యాచ్‌లో బౌలింగ్‌తో ఆకట్టుకోవడంతో పాటు ఒక వికెట్ కూడా తీసుకున్నాడు. అయితే ఇప్పుడు సైడ్ స్ట్రెయిన్ కారణంగా మళ్లీ జట్టుకు దూరం కానున్నాడు.

తొలి టీ20 అనంతరం వరుణ్ మీడియా సమావేశంలో కూడా పాల్గొన్నాడు. ఆ సమయంలో తనకు ఎలాంటి గాయం అయినట్లు అతడు ప్రస్తావించలేదు. ఇటీవల ఎదుర్కొంటున్న గాయాల గురించి ప్రశ్నించగా.. క్రీడాకారులు కష్టపడి పనిచేసే సమయంలో గాయాలు సహజంగానే వస్తాయని చెప్పాడు. కొన్నిసార్లు శరీరం తట్టుకునే పరిమితులను దాటి శ్రమిస్తామని, అప్పుడు శరీరం విశ్రాంతి కోరుకుంటుందని తెలిపాడు. అలాంటి సమయంలో ఒక అడుగు వెనక్కి వేసి మరింత మెరుగ్గా పనిచేసి బలంగా తిరిగి రావాల్సి ఉంటుందని వరుణ్ పేర్కొన్నాడు.

వరుణ్ చక్రవర్తి గాయం నేపథ్యంలో బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఆటగాళ్ల గాయాల నిర్వహణపై మరోసారి చర్చ మొదలైంది. పునరావాసం అనంతరం తిరిగి మ్యాచ్‌లు ఆడిన కొద్దికాలానికే గాయాల బారిన పడుతున్న ఆటగాళ్లలో వరుణ్ కూడా ఒకరిగా మారాడు. ఇదే సమయంలో బీసీసీఐ స్పోర్ట్స్ సైన్స్ విభాగానికి అధిపతి కోసం అన్వేషణ కొనసాగుతోంది. గత ఏడాది నుంచి ఆ కీలక పదవి ఖాళీగా ఉన్నట్లు సమాచారం. వరుణ్ తాజా గాయం అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్‌తో పాటు ఆసియా క్రీడల జట్టుపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది.

Tags: