Vijay Hazare Trophy: సర్పరాజ్ సెంచరీ..గోవాపై ముంబై విక్టరీ
గోవాపై ముంబై విక్టరీ
Vijay Hazare Trophy: విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా బుధవారం గోవాతో జరిగిన మ్యాచ్‌లో ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. కేవలం 75 బంతుల్లో 157 పరుగులు చేసి ముంబై భారీ విజయానికి ప్రధాన కారకులయ్యారు.
సర్ఫరాజ్ కేవలం 56 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్నారు.తన ఇన్నింగ్స్‌లో మొత్తం 14 భారీ సిక్సర్లు, 9 ఫోర్లు బాదారు. అంటే 120 పరుగులు కేవలం బౌండరీల రూపంలోనే రావడం విశేషం.
దాదాపు 209.33 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసి టీ20 తరహాలో విరుచుకుపడ్డారు.సర్ఫరాజ్ విధ్వంసానికి తోడు ముషీర్ ఖాన్ (60), హార్దిక్ తమోర్ (53) రాణించడంతో ముంబై నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 444 పరుగుల భారీ స్కోరు సాధించింది.భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గోవా జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లకు 357 పరుగులు చేసింది. గోవా తరఫున అభినవ్ తేజరానా (100) సెంచరీతో ఆకట్టుకున్నప్పటికీ లక్ష్యం పెద్దది కావడంతో జట్టుకు విజయాన్ని అందించలేకపోయారు. ముంబై జట్టు 87 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
ముంబై బౌలర్లలో కెప్టెన్ శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు తీశారు. గోవా తరఫున ఆడిన అర్జున్ టెండూల్కర్ 8 ఓవర్లలో 78 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశారు.ఈ విజయంతో ముంబై వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసి నాకౌట్ దిశగా దూసుకెళ్లింది. సర్ఫరాజ్ ఖాన్ ఇలాంటి ఇన్నింగ్స్ ఆడటం టీమ్ ఇండియా సెలెక్టర్ల దృష్టిని ఆకర్షిస్తోంది.