Vinoo Mankad Trophy: వీనూ మన్కడ్ ట్రోఫీ.. సెహ్వాగ్ కొడుకుపై ద్రవిడ్ కొడుకు విధ్వంసం.. 41 బంతుల్లోనే 85 రన్స్ బాదిన అన్వయ్..
41 బంతుల్లోనే 85 రన్స్ బాదిన అన్వయ్..
Vinoo Mankad Trophy: క్రికెట్ మైదానంలో టీమిండియా దిగ్గజాలు రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్ వారసులు తలపడ్డారు. అండర్-19 వీనూ మన్కడ్ ట్రోఫీలో భాగంగా కర్ణాటక, ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో రాహుల్ ద్రవిడ్ కుమారుడు అన్వయ్ ద్రవిడ్, సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ ముఖాముఖి తలపడ్డారు. అయితే, ఈ మ్యాచ్‌లో తండ్రుల శైలికి పూర్తి భిన్నమైన ఆటతీరు కనిపించి క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరిచింది.
సాధారణంగా రాహుల్ ద్రవిడ్ అంటే క్లాసిక్ డిఫెన్స్, సెహ్వాగ్ అంటే విధ్వంసకర బ్యాటింగ్ గుర్తుకొస్తాయి. కానీ, ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ద్రవిడ్ కొడుకు అన్వయ్ సెహ్వాగ్‌లా విధ్వంసం సృష్టించగా, సెహ్వాగ్ కొడుకు ఆర్యవీర్ మాత్రం నెమ్మదిగా ఆడి నిరాశపరిచాడు.
అన్వయ్ ద్రవిడ్ మెరుపు ఇన్నింగ్స్
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక అండర్-19 జట్టు నిర్ణీత 49 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 418 పరుగుల భారీ స్కోరు సాధించింది. కర్ణాటక తరఫున నితిన్ ఆర్య (111), ధ్రువ్ కృష్ణన్ (103) సెంచరీలతో రాణించగా, ఆఖర్లో వచ్చిన అన్వయ్ ద్రవిడ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అన్వయ్ కేవలం 41 బంతుల్లోనే 7 ఫోర్లు, 5 భారీ సిక్సర్లతో అజేయంగా 85 పరుగులు పిండుకున్నాడు. ఏకంగా 207.32 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసి ఢిల్లీ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ఢిల్లీ జట్టు మొత్తం కలిసి కొట్టిన సిక్సర్లు కేవలం 5 మాత్రమే కాగా, ఒక్క అన్వయ్ ద్రవిడ్ మాత్రమే ఒంటిచేత్తో 5 సిక్సర్లు బాదడం విశేషం.
తేలిపోయిన ఆర్యవీర్ సేన
419 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ అండర్-19 జట్టును ఆర్యవీర్ సెహ్వాగ్ కెప్టెన్‌గా నడిపించాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఆర్యవీర్.. తండ్రిలా మెరుపులు మెరిపించలేకపోయాడు. 35 బంతులు ఎదుర్కొన్న ఆర్యవీర్ ఒక్క సిక్సర్ కూడా కొట్టకుండా కేవలం 32 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఆర్యవీర్ విఫలమవడంతో ఢిల్లీ జట్టు 41.1 ఓవర్లలో 220 పరుగులకే కుప్పకూలింది. దీంతో కర్ణాటక జట్టు 198 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది.