Abhishek Sharma: భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఎదుర్కొన్న బంతుల పరంగా అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా 2,000 పరుగుల మైలురాయిని చేరుకున్న బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. ఇప్పటివరకు ఈ రికార్డు మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ పేరిట ఉండగా, అభిషేక్ దానిని తిరగరాశాడు.

సిక్సర్‌తో రికార్డుల క్లబ్‌లోకి..

ఇండోర్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో అభిషేక్ శర్మ ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించాడు. ఇన్నింగ్స్ మొదట్లోనే భారీ సిక్సర్‌తో వ్యక్తిగత స్కోరు 33 పరుగులకు చేరగానే, టీ20 ఇంటర్నేషనల్స్‌లో 2,000 పరుగుల ఘనతను పూర్తి చేసుకున్నాడు.

సూర్యకుమార్ రికార్డు బద్దలు

అంతర్జాతీయ టీ20ల్లో 2,000 పరుగులు సాధించడానికి సూర్యకుమార్ యాదవ్ 1,164 బంతులు తీసుకున్నాడు. అయితే అభిషేక్ శర్మ కేవలం 1,024 బంతుల్లోనే ఈ ఘనత సాధించి ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బ్యాటర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ 1,283 బంతులతో మూడో స్థానంలో ఉండగా, గ్లెన్ మ్యాక్స్‌వెల్ 1,304 బంతులతో నాలుగో స్థానంలో ఉన్నాడు.

పవర్‌ప్లేలోనే హాఫ్ సెంచరీ.. 5 మంది భారత దిగ్గజాలతో సమం

ఈ మ్యాచ్‌లో అభిషేక్ కేవలం 18 బంతుల్లోనే తన అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఫిఫ్టీ పవర్‌ప్లే ముగిసేలోపే రావడం విశేషం. అంతర్జాతీయ టీ20ల్లో పవర్‌ప్లే వ్యవధిలోనే హాఫ్ సెంచరీ బాదడం అభిషేక్ కెరీర్‌లో ఇది 7వ సారి. భారత క్రికెట్ చరిత్రలో మిగతా ఐదుగురు స్టార్ బ్యాటర్లు సంయుక్తంగా చేసిన ఫీట్‌ను అభిషేక్ ఒక్కడే సమం చేయడం గమనార్హం..

ఈ మ్యాచ్‌లో మొత్తం 30 బంతులు ఎదుర్కొన్న అభిషేక్ 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 69 పరుగులు చేసి ఔటయ్యాడు. అతని తుఫాన్ ఇన్నింగ్స్ పుణ్యమా అని భారత్ 223 పరుగులు సాధించి, మ్యాచ్‌లో 14 పరుగుల తేడాతో విజయం నమోదు చేసింది.

Tags: