Virat Kohli: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. న్యూజిలాండ్‌తో ఆక్లాండ్‌లో జరిగిన తొలి వన్డేలో 74 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ.. ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఎవరికీ సాధ్యంకాని అరుదైన మైలురాయిని తన పేరిట లిఖించుకున్నాడు. టెస్ట్ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత వన్డేల్లో పూర్తి స్వేచ్ఛగా ఆడుతున్న కోహ్లీ, మరోసారి ‘రన్ మెషీన్’ అనే బిరుదును సార్థకం చేసుకున్నాడు.

ప్రపంచ క్రికెట్‌లో అత్యంత కఠినమైనవిగా భావించే సేనా దేశాల్లో వన్డే ఫార్మాట్‌లో ప్రతీ దేశంలోనూ 50కి పైగా సగటు (50+ Average) నమోదు చేసిన ఏకైక ఆటగాడిగా విరాట్ కోహ్లీ సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

సౌతాఫ్రికా గడ్డపై 76.38 సగటుతో ఆధిపత్యం ప్రదర్శించిన కోహ్లీ.. ఇంగ్లండ్‌లో 51.48, ఆస్ట్రేలియాలో 50.03 యావరేజ్ నమోదు చేశాడు. తాజాగా ఆక్లాండ్ ఇన్నింగ్స్‌తో న్యూజిలాండ్‌లోనూ తన సగటును 51.53కి పెంచుకుని, నాలుగు సేనా దేశాల్లోనూ 50+ యావరేజ్ మైలురాయిని అందుకున్న ఏకైక ప్రపంచ క్రికెటర్‌గా నిలిచాడు.

రికార్డుల రారాజుగా దూసుకుపోతున్న కోహ్లీ ఖాతాలో మరికొన్ని రికార్డులు కూడా చేరాయి. సేనా దేశాల గడ్డపై అత్యధిక సార్లు 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు (78 సార్లు) చేసిన బ్యాటర్‌గా అగ్రస్థానంలో నిలిచాడు. అంతేకాకుండా, సేనా దేశాల జట్లపై అన్ని ఫార్మాట్లు కలిపి అత్యధికంగా 134 సార్లు 50+ స్కోర్లు నమోదు చేసి, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న చారిత్రక రికార్డును సైతం బద్దలు కొట్టాడు.

టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కోహ్లీ ప్రదర్శన మరింత అద్భుతంగా సాగుతోంది. ఆ తర్వాత ఆడిన 16 వన్డేల్లోనే ఏకంగా 77.07 సగటుతో 1002 పరుగులు సాధించాడు. ఇందులో 4 భారీ సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలు ఉండటం విశేషం. వన్డేల్లో తన క్లాస్ ఏమాత్రం తగ్గలేదని చాటిచెబుతూ భారత జట్టుకు మరో అద్భుత విజయాన్ని అందించాడు.

Tags: