WPL 2027: WPL 2027 షెడ్యూల్ విడుదల: జనవరి 14 నుంచే మహిళల ప్రీమియర్ లీగ్.. తొలి మ్యాచ్‌లో RCB vs MI బిగ్ ఫైట్..
తొలి మ్యాచ్‌లో RCB vs MI బిగ్ ఫైట్..
WPL 2027: మహిళల ప్రీమియర్ లీగ్ ఐదో సీజన్‌కు సంబంధించిన అధికారిక షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి అధికారికంగా ప్రకటించింది. 2027 జనవరి 14 నుంచి ఫిబ్రవరి 7 వరకు ఈ మెగా టోర్నీ అభిమానులను అలరించనుంది. సరిగ్గా సంక్రాంతి పండుగ రోజున డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు , మాజీ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగే హైవోల్టేజ్ పోరుతో లీగ్‌కు తెరలేవనుంది. గత సీజన్లో స్మృతి మంధాన సారథ్యంలోని ఆర్సీబీ ట్రోఫీని కైవసం చేసుకోగా, హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ ఇప్పటికే రెండుసార్లు టైటిల్‌ను ముద్దాడింది. దీంతో ఆరంభ మ్యాచ్‌పైనే భారీ అంచనాలు నెలకొన్నాయి.
టోర్నీ నిర్వహణను ఆటగాళ్ల ప్రయాణ భారం తగ్గించేలా కేవలం రెండు నగరాల్లో మాత్రమే నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. మొత్తం 22 మ్యాచ్‌లను వడోదర, ముంబై వేదికల్లో విభజించారు. మొదటి దశలో భాగంగా గుజరాత్‌లోని వడోదర కొతంబి స్టేడియంలో జనవరి 14 నుంచి జనవరి 24 వరకు తొలి 11 లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఆ తర్వాత రెండో దశ మ్యాచ్‌లతో పాటు నాకౌట్ పోరులకు ముంబైలోని ప్రఖ్యాత బ్రబోర్న్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. ప్రసారాల పరంగా వీక్షకులకు అనుకూలంగా ఉండేందుకు టోర్నీలోని అన్ని మ్యాచ్‌లను భారత కాలమానం ప్రకారం ప్రతిరోజూ రాత్రి 7:30 గంటలకే ప్రారంభించనున్నారు.
టోర్నీ ఫార్మాట్ విషయానికి వస్తే, లీగ్ దశలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు నేరుగా గ్రాండ్ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. పట్టికలో రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య ఫిబ్రవరి 5న ముంబై బ్రబోర్న్ స్టేడియంలో ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. ఇందులో విజేతగా నిలిచిన జట్టు ఫిబ్రవరి 7న జరిగే ఫైనల్ మ్యాచ్‌లో టేబుల్ టాపర్‌తో ట్రోఫీ కోసం తలపడుతుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్‌తో పాటు ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్ జట్లు టైటిల్ వేటలో బరిలోకి దిగుతుండటంతో మహిళల క్రికెట్ అభిమానులకు ఈసారి సరికొత్త వినోదం అందడం ఖాయంగా కనిపిస్తోంది.