Will Pucovski: ఒక్క టెస్ట్ మ్యాచ్ ఆడి 27 ఏళ్లకే రిటైర్మెంట్: స్కూల్‌పై కోర్టుకెక్కిన ఆసిస్ మాజీ క్రికెటర్
ఆసిస్ మాజీ క్రికెటర్
Will Pucovski: ఆస్ట్రేలియా తరపున కేవలం ఒక్క టెస్టు మ్యాచ్ మాత్రమే ఆడి, వరుస గాయాల కారణంగా 27 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన యువ బ్యాటర్ విల్ పుకోవిస్కి (Will Pucovski) ఉదంతం క్రికెట్ ప్రపంచంలో కలకలం రేపుతోంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 36 మ్యాచ్‌లు ఆడి అద్భుతమైన ప్రతిభ కనబరిచినప్పటికీ, అతడు ఇంత త్వరగా ఆటకు గుడ్‌బై చెప్పడానికి కారణం విపరీతంగా తలకు దెబ్బలు (Concussions) తగలడమే. అయితే, తన ఈ దుస్థితికి తాను చదువుకున్న పాఠశాల యాజమాన్యమే కారణమని ఆరోపిస్తూ ఆయన తాజాగా కోర్టులో దావా వేయడం గమనార్హం.
అసలు ఏం జరిగింది?
విల్ పుకోవిస్కి టీనేజ్‌లో ఉన్నప్పుడు (2014లో) మెల్‌బోర్న్‌లోని ప్రతిష్టాత్మక బ్రైటన్ ప్రైవేట్ స్కూల్‌లో విద్యనభ్యసించాడు. ఆ సమయంలో తన పదహారేళ్ల వయసులో జరిగిన ఫుట్‌బాల్ ట్రైనింగ్ సెషన్‌లో ఆయన తలకు బలమైన గాయమైంది. అయితే, ఆ సమయంలో స్కూల్ యాజమాన్యం తగిన జాగ్రత్తలు తీసుకోలేదని, సరైన వైద్యం అందించడంలో విఫలమైందని విల్ తీవ్ర ఆరోపణలు చేశారు.
స్కూల్ నిర్లక్ష్యం వల్లే తన కెరీర్ ప్రారంభంలో తలకు తీవ్ర గాయాలయ్యాయని, అదే తన తర్వాతి క్రికెట్ జీవితంలో శాపంగా మారిందని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల ఆయన తన క్రికెట్ కెరీర్‌లో ఏకంగా 13 సార్లు కంకషన్ (మెదడుకు సంబంధించిన గాయాలు) సమస్యను ఎదుర్కొవాల్సి వచ్చింది.
క్రీడా జీవితానికి ముగింపు
వరుసగా తలకు అవుతున్న గాయాల కారణంగా పుకోవిస్కి ఆరోగ్యం దెబ్బతింది. చివరికి వైద్య నిపుణుల నుంచి తీవ్ర హెచ్చరికలు రావడంతో, 2024లో ఆయన అన్ని రకాల క్రీడలకు వీడ్కోలు పలకాలని స్వతంత్ర మెడికల్ ప్యానల్ సిఫార్సు చేసింది. దీంతో చిన్న వయసులోనే ఒక గొప్ప క్రికెటర్ కెరీర్ అర్ధాంతరంగా ముగిసిపోయింది. ప్రస్తుతం ఆయన తన కెరీర్‌ను నాశనం చేశారంటూ స్కూల్ మేనేజ్‌మెంట్‌పై న్యాయపోరాటానికి దిగడం క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.