Mirabai Chanu: ఆసియా గేమ్స్ పతకమే నా మెయిన్ టార్గెట్..స్టార్ లిఫ్టర్ మీరాబాయి చాను సంచలన వ్యాఖ్యలు

మీరాబాయి చాను సంచలన వ్యాఖ్యలు

Update: 2026-07-25 04:11 GMT

Mirabai Chanu: భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్, ఒలింపిక్ పతక విజేత మీరాబాయి చాను రాబోయే కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి కామన్వెల్త్ గేమ్స్‌లో తాను నూరు శాతం శ్రమ పెట్టనని, తన దృష్టంతా సెప్టెంబరులో జరిగే ఆసియా క్రీడలపైనే ఉందని స్పష్టం చేశారు.

ఆసియా క్రీడల్లో తొలిసారిగా పతకం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు చాను తెలిపారు. కామన్వెల్త్ క్రీడలకు, ఆసియా గేమ్స్‌కు మధ్య సమయం చాలా తక్కువగా ఉండటంతో... అనవసరమైన రిస్క్ తీసుకోకూడదనే ఉద్దేశంతోనే కామన్వెల్త్ క్రీడల్లో 90 కేజీల స్నాచ్‌కు దూరంగా ఉంటున్నట్లు వెల్లడించారు. తన శక్తిని కాపాడుకోవడానికే ఈ కీలక నిర్ణయం తీసుకున్నానని, ఆసియా క్రీడల్లో ఖచ్చితంగా 90 కేజీల బరువు ఎత్తేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు.

48 కేజీల విభాగంలో బరిలోకి దిగుతున్న చాను... అథ్లెట్ జీవితంలో శరీర బరువును అదుపులో ఉంచుకోవడమే అత్యంత కష్టమైన అంశమని పేర్కొన్నారు. అయితే లాస్ ఏంజెల్స్ 2028 ఒలింపిక్స్ ముందు వెయిట్ కేటగిరీల్లో మార్పులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో... ఆసియా క్రీడలు ముగిసిన తర్వాత తాను 53 కిలోల విభాగంలోకి మారాలని నిర్ణయించుకున్నట్లు చాను స్పష్టం చేశారు.

టోక్యో ఒలింపిక్స్‌లో రజతం, రెండు ప్రపంచ ఛాంపియన్‌షిప్ పతకాలు, కామన్వెల్త్ గేమ్స్‌లో రెండు స్వర్ణాలు సహా ఒక రజతాన్ని ముద్దాడిన మీరాబాయి చాను... ఆసియా క్రీడల్లో మాత్రం ఇప్పటివరకు ఒక్క పతకం కూడా గెలవలేకపోయారు. అందుకే ఈసారి ఎలాగైనా ఆసియా క్రీడల పతకాన్ని తన ఖాతాలో వేసుకోవాలని పట్టుదలతో ఉన్నారు.

Tags:    

Similar News