Women's Premier League (WPL) 2026: WPL చరిత్రలో సంచలనం... ఆర్సీబీ రికార్డు
ఆర్సీబీ రికార్డు
Women's Premier League (WPL) 2026: డబ్ల్యూపీఎల్ (WPL) చరిత్రలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) సంచలనం సృష్టించింది. వడోదరలోని కోటంబి మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి, రెండోసారి ట్రోఫీని ముద్దాడింది. తద్వారా ముంబై ఇండియన్స్ తర్వాత రెండు టైటిళ్లు గెలిచిన రెండో జట్టుగా ఆర్సీబీ రికార్డు సృష్టించింది. ముఖ్యంగా ఎల్లీస్ పెర్రీ వంటి కీలక ఆటగాళ్లు లేకపోయినప్పటికీ, అద్భుత ప్రదర్శనతో జట్టు విజేతగా నిలవడం విశేషం.
ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఒక భారీ రికార్డును తన పేరిట లిఖించుకుంది. ఢిల్లీ నిర్దేశించిన 204 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి, డబ్ల్యూపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరును ఛేజ్ చేసిన మొదటి జట్టుగా నిలిచింది. అది కూడా సీజన్లోనే అత్యంత కీలకమైన ఫైనల్ మ్యాచ్‌లో ఈ ఘనత సాధించడం గమనార్హం. అంతకుముందు ఏ జట్టు కూడా ఇంతటి భారీ లక్ష్యాన్ని ఛేదించలేదు.
తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత ఓవర్లలో 203 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ జెమిమా రోడ్రిగ్స్ 37 బంతుల్లో 57 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా, చివర్లో చినెల్ హెన్రీ కేవలం 15 బంతుల్లోనే 35 పరుగులతో మెరుపులు మెరిపించింది. దీంతో ఢిల్లీ పటిష్ట స్థితిలో నిలిచింది.
అయితే, భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి ఓపెనర్లు స్మృతి మంధాన, జార్జియా వోల్ అద్భుతమైన పునాది వేశారు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు ఏకంగా 165 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మంధాన 41 బంతుల్లో 87 పరుగులతో విరుచుకుపడగా, వోల్ 54 బంతుల్లో 79 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించారు. చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో మరో రెండు బంతులు మిగిలి ఉండగానే ఆర్సీబీ విజయాన్ని అందుకుంది.
విజయం అనంతరం కెప్టెన్ స్మృతి మంధాన మాట్లాడుతూ.. 203 పరుగులు అనేది ఫైనల్ మ్యాచ్‌లో పెద్ద స్కోరే అని, కానీ తమ జట్టు సభ్యుల కఠిన శ్రమ, ఆత్మవిశ్వాసం ఈ విజయాన్ని సాధ్యం చేశాయని తెలిపారు. బౌలింగ్‌లో లారెన్ బెల్ పొదుపుగా బౌలింగ్ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పిందని, అలాగే జార్జియా వోల్ ఇన్నింగ్స్ చాలా స్పెషల్ అని ప్రశంసించారు. తమ సపోర్ట్ స్టాఫ్ ప్రోత్సాహం వల్లే ఈ ఘనత సాధ్యమైందని ఆమె పేర్కొన్నారు.