Yastika Bhatia: టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే తొలి మహిళగా యాస్తికా భాటియా రికార్డు
యాస్తికా భాటియా రికార్డు
Yastika Bhatia: క్రికెట్ మక్కాగా పిలిచే చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో.. భారత మహిళా క్రికెట్ జట్టు సరికొత్త ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించింది! ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆటలో.. టీమిండియా స్టార్ బ్యాటర్ యాస్తికా భాటియా అద్భుతమైన ప్రదర్శనతో విశ్వరూపం చూపించింది.
టెస్టు క్రికెట్ చరిత్రలోనే... లార్డ్స్ స్టేడియంలో సెంచరీ సాధించిన మొట్టమొదటి మహిళా క్రికెటర్‌గా యాస్తికా భాటియా సరికొత్త వరల్డ్ రికార్డును తన పేరిట లిఖించుకుంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఏ మహిళా బ్యాటర్ కూడా సాధించని ఈ అరుదైన ఘనతను.. మన భారతీయ ప్లేయర్ సాధించడం విశేషం!
ఇంగ్లాండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ, ఎంతో బాధ్యతాయుతంగా ఆడిన యాస్తికా.. కేవలం 145 బంతుల్లోనే 12 ఫోర్ల సహాయంతో తన కెరీర్‌లోనే చిరస్మరణీయమైన తొలి అంతర్జాతీయ టెస్ట్ సెంచరీని పూర్తి చేసింది. అయితే ఈ చారిత్రాత్మక శతకం వెనుక ఒక ఆసక్తికరమైన సంఘటన కూడా జరిగింది!
నిన్న మూడో రోజు ఉదయం వేసిన తొలి బంతికే అదృష్టం కలిసివచ్చింది. ఇంగ్లాండ్ పేసర్ లారెన్ బెల్ వేసిన ఆ మొదటి బంతి.. యాస్తికా ఆఫ్ స్టంప్‌ను బలంగా తాకింది! ఇంకేముంది క్లీన్ బౌల్ అనుకున్నారంతా.. కానీ, లక్ అంటే యాస్తికాదే అన్నట్టు బంతి స్టంప్‌కు తగిలినా బెయిల్స్ మాత్రం కింద పడలేదు. దాంతో ఆమె తృటిలో క్లీన్ బౌల్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఆ అదృష్టాన్ని అందిపుచ్చుకున్న యాస్తికా.. ఆ తర్వాత ఇంగ్లాండ్ బౌలర్లపై చెలరేగిపోయి లార్డ్స్ వేదికగా సెంచరీతో రికార్డుల కెక్కేసింది.