Young Sensation Vaibhav Suryavanshi: యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి రాష్ట్రీయ బాల పురస్కార్

రాష్ట్రీయ బాల పురస్కార్

Update: 2025-12-27 05:41 GMT

Young Sensation Vaibhav Suryavanshi: టీమిండియా యువ క్రికెట్ సంచలనం, బీహార్‌కు చెందిన వైభవ్ సూర్యవంశీ (14) ప్రతిష్టాత్మకమైన 'ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ - 2025' అందుకున్నారు. ఢిల్లీలోని రాష్ట్రీయ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును స్వీకరించారు.క్రీడల విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను వైభవ్‌కు ఈ గౌరవం లభించింది. భారతదేశంలో 5 నుండి 18 ఏళ్ల లోపు బాలలకు ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారం. ఈ అవార్డు కింద వైభవ్‌కు ఒక మెడల్, రూ. 1,00,000 నగదు బహుమతి, ప్రశంసా పత్రం లభించాయి.అవార్డు అందుకున్న అనంతరం వైభవ్ , ఇతర గ్రహీతలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు.

వైభవ్ గత కొద్ది కాలంగా క్రికెట్ ప్రపంచంలో అద్భుతమైన ఫామ్‌లో ఉండి అనేక ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టాడు ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో (14 ఏళ్ల 23 రోజులు) అరంగేట్రం చేసిన ఆటగాడిగా రాజస్థాన్ రాయల్స్ తరపున రికార్డు సృష్టించాడు. గుజరాత్ టైటాన్స్‌పై కేవలం 35 బంతుల్లోనే సెంచరీ చేసి ఐపీఎల్‌లో అతి చిన్న వయసులో సెంచరీ చేసిన ప్లేయర్‌గా నిలిచాడు.

ఇటీవల విజయ్ హజారే ట్రోఫీలో అరుణాచల్ ప్రదేశ్‌పై 36 బంతుల్లో సెంచరీ చేసి, లిస్ట్-ఏ క్రికెట్‌లో అతి పిన్న వయసులో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఇదే మ్యాచ్‌లో 150 పరుగుల మార్కును కేవలం 59 బంతుల్లోనే చేరుకుని, ఏబీ డివిలియర్స్ (64 బంతులు) పేరిట ఉన్న ఫాస్టెస్ట్ 150 రికార్డును బద్దలు కొట్టాడు. ఇండియా అండర్-19 జట్టు తరపున ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లపై కూడా అత్యంత వేగవంతమైన సెంచరీలు నమోదు చేశాడు.ఈ పురస్కారాన్ని అందుకోవడం కోసం వైభవ్ ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో ఒక మ్యాచ్‌కు దూరమయ్యాడు. త్వరలో జరగనున్న అండర్-19 ప్రపంచ కప్‌లో ఆయన భారత జట్టు తరపున కీలక పాత్ర పోషించనున్నాడు.

Tags:    

Similar News