Yuvraj Singh: ఢిల్లీ క్యాపిటల్స్ కోచింగ్ స్టాఫ్‌లోకి యువరాజ్ సింగ్

యువరాజ్ సింగ్

Update: 2026-06-20 05:37 GMT

Yuvraj Singh: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2027 సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ (DC) ఫ్రాంచైజీలో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. భారత మాజీ ఆల్రౌండర్, ప్రపంచకప్ హీరో యువరాజ్ సింగ్ ఢిల్లీ క్యాపిటల్స్ కోచింగ్ స్టాఫ్‌లో చేరినట్లు ‘ది టైమ్స్ ఆఫ్ ఇండియా’ కథనం పేర్కొంది. జేఎస్‌డబ్ల్యూ (JSW) గ్రూప్ మళ్లీ జట్టు నిర్వహణ బాధ్యతలు చేపట్టనుండటంతో, భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఈ సీజన్‌కు జట్టు కోచింగ్ పగ్గాలను హ్యాండ్ ఓవర్ చేసుకోనున్నారు. ఈ క్రమంలోనే యువరాజ్ సింగ్ తన సపోర్ట్ స్టాఫ్ టీమ్‌లో ఉండాలని గంగూలీ కోరుకున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన ఎస్ఏ20 (SA20) టోర్నీలో ప్రిటోరియా క్యాపిటల్స్ జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరించిన గంగూలీ, ఆ జట్టును రన్నరప్‌గా నిలిపారు. ఇప్పుడు అదే జోష్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు.

ఐపీఎల్ ఫ్రాంచైజీలలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఒక ప్రత్యేకమైన యాజమాన్య ఒప్పందం ఉంది. జీఎంఆర్ (GMR) గ్రూప్, జేఎస్‌డబ్ల్యూ (JSW) గ్రూప్‌లు చెరో 50 శాతం వాటాతో ఈ ఫ్రాంచైజీని నడుపుతున్నాయి. ప్రతి రెండేళ్లకు ఒకసారి ఇరు సంస్థలు జట్టు నిర్వహణ బాధ్యతలను మార్చుకుంటాయి. ఐపీఎల్ 2026 సీజన్‌లో జీఎంఆర్ గ్రూప్ నేతృత్వంలోని ఢిల్లీ జట్టు ఆరో స్థానంలో నిలవడంతో వారి పదవీకాలం ముగిసింది. జీఎంఆర్ మరికొంత కాలం బాధ్యతల్లో కొనసాగాలని భావిస్తున్నట్లు ప్రచారం జరిగినప్పటికీ, తాజా ఒప్పందం ప్రకారం జేఎస్‌డబ్ల్యూ ఛైర్మన్ పార్థ్ జిందాల్ ఈసారి సౌరవ్ గంగూలీకి పూర్తి బాధ్యతలు అప్పగించనున్నారు. ఈ క్రమంలోనే గంగూలీ తన పాత మిత్రుడు యువరాజ్ సింగ్‌ను జట్టులోకి ఆహ్వానించారు.

యువరాజ్ సింగ్‌కు ఐపీఎల్‌లో ఒక అధికారిక కోచ్‌గా ఇదే మొదటి అనుభవం కానుంది. గతంలో ఆయన గుజరాత్ టైటాన్స్ వంటి ఇతర జట్లతో చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చినప్పటికీ, ఏదీ కార్యరూపం దాల్చలేదు. అయితే, యువరాజ్ ఇప్పటికే అభిషేక్ శర్మ, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, అబ్దుల్ సమద్ వంటి ఎందరో యువ ఐపీఎల్ ఆటగాళ్లకు వ్యక్తిగతంగా మెంటార్‌గా వ్యవహరించి వారి కెరీర్‌ను మలచడంలో కీలక పాత్ర పోషించారు. అంతేకాకుండా, టీ20 ప్రపంచకప్ 2026 సమయంలో స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ కూడా తనకు సహాయం చేసినందుకు యువరాజ్ సింగ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పంజాబ్ క్రికెట్ ఎకోసిస్టమ్‌పై పట్టున్న యువరాజ్, అక్కడ యువ ప్రతిభను వెలికితీసేందుకు క్యాంపులు కూడా నిర్వహిస్తున్నారు.

అయితే, యువరాజ్ సింగ్ ‘ప్రోలిథిక్’ (Prolithic) అనే ప్రముఖ స్పోర్ట్స్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీని కూడా నడుపుతున్నారు. ఆయన పర్యవేక్షణలో రాటుదేలిన అభిషేక్ శర్మ, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ వంటి ఆటగాళ్లు ఈ ఏజెన్సీ క్లయింట్లుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఒక ఐపీఎల్ ఫ్రాంచైజీకి అధికారిక కోచ్‌గా బాధ్యతలు చేపడితే, ఈ ప్రయోజనాల సంఘర్షణ (Conflict of Interest) సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు, రెండు సార్లు ప్రపంచకప్ గెలిచిన యువరాజ్ సింగ్ అనుభవం, గెలుపు వ్యూహాలు ఖచ్చితంగా పెద్ద ప్లస్ పాయింట్ అవుతాయని మేకర్స్ భావిస్తున్నారు.

Tags:    

Similar News