TVK Wins Floor Test: బలపరీక్షలో విజయం సాధించిన విజయ్‌ ప్రభుత్వం

తమిళనాడు నూతన ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్‌ శాసనసభలో తన బలాన్ని స్పష్టంగా నిరూపించుకున్నారు.

Update: 2026-05-13 11:13 GMT

TVK Wins Floor Test

TVK Wins Floor Test: తమిళనాడు నూతన ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్‌ (Joseph Vijay) శాసనసభలో తన బలాన్ని స్పష్టంగా నిరూపించుకున్నారు. బుధవారం జరిగిన బలపరీక్షలో విజయ్‌ ప్రభుత్వం స్పష్టమైన మెజార్టీతో విజయం సాధించింది.

ఈ ఉదయం అసెంబ్లీలో విజయ్‌ సర్కారు తీర్మానం ప్రవేశపెట్టగా, దానిపై చర్చ జరిగింది. అనంతరం స్పీకర్‌ ప్రత్యేక ఓటింగ్‌ నిర్వహించారు. ఒక్కో ఎమ్మెల్యే పేరు పిలుస్తూ వారి సమ్మతిని నమోదు చేశారు. ఈ ఓటింగ్‌లో విజయ్‌ ప్రభుత్వానికి 144 మంది మద్దతు తెలిపగా, 22 మంది వ్యతిరేకించారు. డీఎంకే సభ్యులు బలపరీక్ష సమయంలో అసెంబ్లీ నుంచి వాకౌట్‌ చేశారు.

టీవీకే ప్రభుత్వానికి కాంగ్రెస్‌, వీసీకే, ఐయూఎంఎల్‌ పార్టీలు మద్దతు ఇచ్చాయి. అన్నాడీఎంకే రెబల్‌ ఎమ్మెల్యేలు కూడా సీఎం విజయ్‌కు అనుకూలంగా ఓటు వేశారు.

అన్నాడీఎంకేలో గందరగోళం

చర్చ సందర్భంగా అసెంబ్లీలో కొంత ఉద్రిక్తత నెలకొంది. అన్నాడీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి పళనిసామి మాట్లాడుతూ విజయ్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యేలకు డబ్బు ఆఫర్లు చేశారని, బలపరీక్షకు ముందు తమ ఎమ్మెల్యేలను కలవడం సరికాదని విమర్శించారు. అయితే, అన్నాడీఎంకే రెబల్‌ వర్గం ఎమ్మెల్యేలు ఈ ఆరోపణలను ఖండించారు. తాము విజయ్‌కు మద్దతు ఇస్తామని వేలుమణి స్పష్టం చేశారు.

ఉదయనిధి స్టాలిన్‌ విమర్శలు

డీఎంకే ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్‌ మాట్లాడుతూ విజయ్‌ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ‘‘రాష్ట్రానికి రియల్‌ ప్రభుత్వం కావాలి, రీల్‌ ప్రభుత్వం కాదు. టీవీకేకు సొంత మెజార్టీ లేదు. ఎమ్మెల్యేల కొనుగోళ్ల ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఇది రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీస్తోంది’’ అని ఆరోపించారు. ఆ తర్వాత డీఎంకే సభ్యులు వాకౌట్‌ చేశారు.

విజయ్‌ హామీ

చివరిగా మాట్లాడిన సీఎం విజయ్‌, మద్దతు ఇచ్చిన పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు. ‘‘మా ప్రభుత్వం పూర్తి ఐదేళ్లు కొనసాగుతుంది. లౌకిక విధానాలతో పాలన సాగిస్తాం. గతంలోని సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తాం. మహిళల భద్రత, సామాజిక న్యాయం పట్ల ప్రత్యేక దృష్టి సారిస్తాం’’ అని పునరుద్ఘాటించారు. ఓఎస్‌డీ నియామకం వివాదంపై స్పందిస్తూ పునఃసమీక్షిస్తామని తెలిపారు. తమిళనాడు అసెంబ్లీలో 234 స్థానాలుండగా, టీవీకే (TVK) 108 సీట్లు గెల్చుకుంది. డీఎంకే (DMK) 59, అన్నాడీఎంకే (AIADMK) 47 స్థానాల్లో విజయం సాధించాయి.

Tags:    

Similar News