అక్రమ కేసులతో ప్రజల గొంతు నొక్కే ప్రయత్నం: రేవంత్ ప్రభుత్వంపై హరీశ్‌రావు ఆగ్రహం
KTR Being Harassed for Exposing Govt Failures, Says Harish Rao Political Vendetta Alleged: Harish Rao Questions CM Revanth Reddy
కేటీఆర్‌పై రాజకీయ కక్షసాధింపు చర్యలకు పరాకాష్ట : హరీశ్‌రావు ధ్వజం
మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై జరుగుతున్న రాజకీయ కక్షసాధింపు చర్యలు పరాకాష్టకు చేరుకున్నాయి అని మాజీ మంత్రి, బీآర్‌ఎస్ సీనియర్ నాయకుడు హరీశ్‌రావు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ, ప్రజల తరఫున ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే గొంతును నొక్కివేయడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీసుకుంటున్న చర్యలు దుర్మార్గానికీ, అప్రజాస్వామిక వ్యవహారానికీ నిదర్శనమని ఆయన ధ్వజమెత్తారు.
ఫార్ములా–ఈ రేస్, హైదరాబాద్‌ను గ్లోబల్ మ్యాప్‌పై నిలబెట్టిన ఈ అంతర్జాతీయ ఈవెంట్‌ను, అప్పటి ఐటీ మంత్రి కేటీఆర్ పూర్తిస్థాయి పారదర్శకతతో, గర్వపడేలా నిర్వహించారని హరీశ్‌రావు . రెండు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమంలో అవకతవకలు ఉన్నాయంటూ కాంగ్రెస్ ప్రభుత్వం కోడిగుడ్డుపై ఈకలు పీకే ప్రయత్నం చేయడమే కాకుండా, ఇప్పుడు అదే కార్యక్రమాన్ని కారణంగా చూపుతూ అక్రమ కేసులు బనాయించడం పూర్తిగా రాజకీయ కక్షసాధింపు తప్ప మరేది కాదని హరీశ్‌రావు మండిపడ్డారు.
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను ప్రపంచానికి పరిచయం చేసిన నాయకుడు కేటీఆర్ అని అన్నారు. ప్రపంచ స్థాయి పెట్టుబడులను, కంపెనీలను తెలంగాణకు తీసుకొచ్చిన నాయకుడిపై ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి కేసులు పెట్టడం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సిగ్గుచేటని విమర్శించారు. తమ వైఫల్యాలను దాచి పెట్టడానికి, నిరుద్యోగం నుండి ధరల పెరుగుదల వరకు ప్రతి విషయంలో విఫలమైన తమ పాలనను కప్పిపుచ్చుకోవడానికి కేటీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని కేసుల రాజకీయాలు చేస్తున్నారు.
ప్రభుత్వం ఎంతలా బెదిరించినా, ఎంత అక్రమ కేసులు పెట్టినా, కేటీఆర్‌కు ఉన్న ప్రజా మద్దతు, పార్టీ వర్కర్ల విశ్వాసం దెబ్బతినదన్నారు. రాజకీయ లాభాల కోసం స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో చేస్తున్న చిల్లర డ్రామాలు ప్రజలుగమనిస్తున్నారని పేర్కొన్నారు. అక్రమ కేసులతో భయపెట్టే ప్రయత్నాలు బీఆర్‌ఎస్ నాయకుల మనోబలాన్ని తగ్గించలేవని, పోరాటస్ఫూర్తి మరింత పెరుగుతుందని ఆయన అన్నారు. కేటీఆర్‌కు బీఆర్‌ఎస్ పార్టీ పూర్తిగా అండగా ఉంటుంది, రేవంత్‌రెడ్డి దుర్మార్గ వైఖరిని చట్టపరంగా, ప్రజాస్వామ్యపరంగా ఎదుర్కొంటామని హరీశ్‌రావు అన్నారు.