A. Revanth Reddy: ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగల పోరాటానికి నా పూర్తి మద్దతు: సీఎం రేవంత్ రెడ్డి

మాదిగల పోరాటానికి నా పూర్తి మద్దతు: సీఎం రేవంత్ రెడ్డి

Update: 2026-03-07 06:11 GMT

A. Revanth Reddy: ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే శాసనసభలో తీర్మానం చేసి, దాన్ని అమలు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ ఖ్యాతి గడించిందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రజా జీవితంలోకి అడుగుపెట్టినప్పటి నుంచి మాదిగల వర్గీకరణ పోరాటాన్ని దగ్గరుండి చూస్తున్నానని, ఈ విషయంలో ప్రతిసారీ తమకు అండగా నిలిచానని, కృష్ణమాదిగ, సతీశ్‌మాదిగలకు పూర్తి మద్దతు ఇచ్చానని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ మాదిగ ఉద్యోగుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో శుక్రవారం ఏర్పాటు చేసిన ధన్యవాద సభలో సీఎం ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మాదిగ ఉద్యోగులు ఆయనను ఘనంగా సత్కరించారు.

2023 శాసనసభ ఎన్నికల్లో మాదిగలు తమకు మద్దతు ప్రకటించారని గుర్తు చేసిన రేవంత్‌రెడ్డి, ప్రభుత్వ ఉద్యోగులు కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు పన్నులు వసూలు చేసి ఖజానాను నింపుతుంటే, పేదల సంక్షేమానికి ఆ డబ్బును తిరిగి ఖర్చు చేస్తామని అన్నారు. ప్రభుత్వానికి కళ్లు, చెవులు, బ్రాండ్ అంబాసిడర్లుగా ఉద్యోగులు వ్యవహరిస్తున్నారని, వారు వృత్తి ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తిస్తే దళితులు, బడుగు, బలహీన వర్గాల జీవితాల్లో సంతోషం నిండుతుందని చెప్పారు.

మహాభారతంలో తనకు ఇష్టమైన పాత్రలు కర్ణుడు, బర్బరీకుడని చెప్పిన సీఎం, మాదిగ జాతికి మద్దతు ఇచ్చినప్పుడు స్నేహితుడికి మాట ఇచ్చిన కర్ణుడిలా వ్యవహరించానని అన్నారు. స్నేహితుడి కోసం కర్ణుడు సర్వశక్తులు ధారపోసి పోరాడినట్లు, బలహీనుల పక్షాన బర్బరీకుడు నిలిచినట్లు తాను కూడా న్యాయం మాదిగల పక్కనే ఉందని నమ్మి వర్గీకరణలో అండగా నిలిచానని వివరించారు. వర్గీకరణ అమలు వల్ల సమస్యలు చాలావరకు పరిష్కారమయ్యాయని గర్వంగా చెప్పుకోవచ్చని అన్నారు.

మాదిగ జాతి పిల్లలు డాక్టర్లు, ఇంజినీర్లు, లాయర్లు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా ఎదగాలని, రాజ్యాధికారాన్ని అనుభవించాలని సీఎం కోరారు. మాదిగ జాతి ఉన్నతికి ప్రత్యేక చట్టం తీసుకువస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వాల్లోని పెద్దలు బడుగు బలహీన వర్గాలు బర్రెలు, గొర్రెలు కాయాలని, చేపలు అమ్మాలని, మాదిగ పిల్లలు చెప్పులు కుట్టాలని భావించారని విమర్శించారు. మన పిల్లలు అధమంగా ఉండాలని, వారి పిల్లలకు మాత్రం రాజ్యాధికారం కావాలని ప్రశ్నించారు. అందుకే అసూయ పడేలా ఉన్నత స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు.

ఇటీవల తన పేర్లను ఊరికే మారుస్తున్నారని చెప్పిన రేవంత్‌రెడ్డి, బీసీలకు సాయం చేస్తే రేవంత్ గౌడ్, క్రైస్తవులకు మద్దతిస్తే డేవిడ్ రేవంత్, సిక్కులకు అండగా నిలిస్తే సర్దార్ రేవంత్ సింగ్, ముస్లింలకు మద్దతిస్తే అసదుద్దీన్ రేవంత్ అంటున్నారని అన్నారు. ఎవరేమన్నా పట్టించుకోకుండా పదిమందికి ఉపయోగపడటంలో, నిస్సహాయులకు సేవ చేయడంలోనే నిజమైన సంతోషం ఉందని పేర్కొన్నారు.

కార్యక్రమంలో మంత్రులు దామోదర్ రాజనర్సింహ, అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, వేముల వీరేశం, కాలె యాదయ్య, లక్ష్మీకాంతరావు, కవ్వంపల్లి సత్యనారాయణ, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాశీం, మాదిగ ఉద్యోగుల సమన్వయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags:    

Similar News