Deputy CM Bhatti Vikramarka: ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు తీసుకురావడమే కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగం యొక్క అసలు లక్ష్యమని తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల వేగం పెంచి, ప్రజల సమస్యలను సకాలంలో పరిష్కరించే దిశగా ఏఐను వినియోగించాలని అధికారులను ఆదేశించారు.

బుధవారం హైదరాబాద్‌లో ‘ఏఐ సాక్షమ్’ కార్యక్రమం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన, వేగవంతమైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఆదా అయ్యే సమయాన్ని ప్రజలకు కేటాయించాలని సూచించారు. రైతులు, పింఛనుదారులు కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి మారాలని గట్టిగా అన్నారు.

ప్రభుత్వ ఉద్యోగుల సామర్థ్యం పెంపొందించేందుకే ‘ఏఐ సాక్షమ్’ను అమలు చేస్తున్నట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ప్రజాధనం వినియోగం, ప్రాజెక్టుల వ్యయాల విశ్లేషణలో ఏఐ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరుతున్నాయో లేదో గుర్తించడంలోనూ ఏఐ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. విద్యుత్ డిమాండ్ అంచనా, పరికరాల్లోని లోపాల గుర్తింపులో కూడా ఏఐను వినియోగించవచ్చని వివరించారు.

ప్రభుత్వ ఉత్తర్వులు, నివేదికల తయారీలో ఏఐ వల్ల గణనీయమైన సమయం ఆదా అవుతుందని ఉపముఖ్యమంత్రి తెలిపారు. అయితే ఏఐ ఇచ్చే సమాచారాన్ని అధికారులు తప్పనిసరిగా ధ్రువీకరించుకోవాలని సూచించారు. ప్రజల వ్యక్తిగత సమాచార భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని ఉద్ఘాటించారు. ఏఐ నిర్ణయాలపై మానవ పర్యవేక్షణ తప్పనిసరి అని, ఏఐ వినియోగంలో జరిగే తప్పులకు బాధ్యత వహించే వ్యక్తి ఎవరో స్పష్టంగా ఉండాలని అన్నారు.

చిన్నస్థాయి ప్రయోగాలు విజయవంతమైన తర్వాతే ఏఐ వ్యవస్థలను విస్తరించాలని మార్గనిర్దేశం చేశారు. ప్రజలకు పారదర్శకమైన, వేగవంతమైన సేవలు అందించడమే ఏఐ విజయానికి కొలమానమని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

Tags: