Minister Seethakka: ఎల్‌నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా శాఖ రూపొందించిన ‘జలసిరి’ వీడియోను బుధవారం ఆవిష్కరించారు. అలాగే గవర్నర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా మళ్లీ నియమితులైన దాన కిషోర్‌ను అభినందించి సత్కరించారు.

రాష్ట్రవ్యాప్తంగా 12,516 గ్రామ పంచాయతీల్లో ఉపాధి పనులు ప్రారంభమయ్యాయని మంత్రి వెల్లడించారు. మిగిలిన 244 గ్రామ పంచాయతీల్లో వెంటనే పనులు ప్రారంభించాలని దిశానిర్దేశం చేశారు. అక్టోబరు 27న ఉపాధి పనులకు 3,97,788 మంది కూలీలు హాజరు కావడం రికార్డు స్థాయి అని తెలిపారు. ఇంకా కూలీల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రతి 40 మంది కూలీలకు ఒక మేట్‌ను నియమించాలని ఆదేశించారు.

నీటి సంరక్షణ, చెరువుల పునరుద్ధరణ, ఫామ్ పాండ్లు, ఇంకుడు గుంతలు, బోర్‌వెల్ రీచార్జ్ వంటి పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి పేర్కొన్నారు. పశువులకు మేత, తాగునీటి కొరత రాకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని మార్గనిర్దేశం చేశారు. సర్పంచులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఎల్‌నినోను ఎదుర్కోవాలని, గ్రామాల్లో కూలీలను మొబిలైజ్ చేయాలని సూచించారు. మౌలిక వసతుల కల్పనకు బడ్జెట్ ఉందని, దాని ద్వారా అభివృద్ధి పనులు చేపట్టాలని, ప్రతి గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలని తెలిపారు. వెనుకబడ్డ సర్పంచులు, కార్యదర్శులు, మండల అధికారులపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

గ్రామాల అభివృద్ధి పనులు GPSAPలో నమోదు అవుతున్నాయని, దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లో కోటి 12 లక్షల రికార్డులను నమోదు చేశామని మంత్రి వివరించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఐటీడీఏ పీవోలు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కూలీలకు పనులు కల్పించాలని, చెక్ డ్యామ్‌లు నిర్మించాలని సూచించారు. వలసలను నివారించే లక్ష్యంతో ఉపాధి పనులు కల్పించాలని, ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి ప్రజలకు ఎల్‌నినోను ఎదుర్కోగలమనే భరోసా ఇవ్వాలని అన్నారు. ఉక్కు మహిళా ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నవంబర్ 19న గ్రామ మహిళా సంఘ భవనాలను ప్రారంభిస్తామని, అప్పటిలోగా సంబంధిత పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

Tags: