AICC: తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడంపై అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ (ఏఐసీసీ) ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు ఇటీవల ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌తో పాటు సీడబ్ల్యూసీ సభ్యులు, సీనియర్‌ మంత్రులతో ఏఐసీసీ పెద్దలు వరుస భేటీలు, సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించారు.

ఈ సమావేశాల్లో పార్టీ సంస్థాగత కార్యక్రమాలు, ఎన్యూమరేషన్‌ ప్రక్రియ జరుగుతున్న తీరు, ఏఐసీసీ పిలుపు మేరకు రాష్ట్రంలో చేపడుతున్న కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వం, పార్టీ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తూనే పలు కీలక సూచనలు చేశారు. పీసీసీ నూతన కార్యనిర్వాహక అధ్యక్షుల నియామకంపైనా ఏఐసీసీ కసరత్తు చేస్తోంది. పాత, కొత్త నాయకుల మధ్య విభేదాలను పార్టీకి నష్టం జరగకుండా సామరస్యంగా పరిష్కరించేందుకు పీసీసీ పరిశీలకులను నియమించి నివేదికలు తెప్పించుకునే పనిలో ఉంది.

పనితీరు సరిగ్గా లేని మూడు జిల్లాల అధ్యక్షులను మార్చాలని ఏఐసీసీ నిర్ణయించింది. వారి స్థానంలో కొత్త అధ్యక్షులను నియమించే ప్రక్రియ కోసం పీవీ మోహన్‌, దీపక్‌ రాథోర్‌లను పరిశీలకులుగా నియమించింది. వీరు ఆయా జిల్లాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలతో సంప్రదింపులు జరిపి నూతన అధ్యక్షుల నియామకంపై ఏఐసీసీకి నివేదిక అందజేస్తారు.

యువతకు, ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టగల నేతలకు కీలక పదవులు ఇవ్వాలని ఏఐసీసీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డిని పీసీసీ మీడియా కమిటీ ఛైర్మన్‌గా, నవీన్‌ పొట్టెంను సోషల్‌ మీడియా ఛైర్మన్‌గా నియమించినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

కాలపరిమితి ముగిసిన కార్పొరేషన్ల ఛైర్మన్లు, వైస్‌ ఛైర్మన్లు, డైరెక్టర్లు, ఇతర నామినేటెడ్‌ పదవుల భర్తీపైనా ఏఐసీసీ, పీసీసీల కసరత్తు తుది దశకు చేరుకుంది. పార్టీకి విధేయులుగా ఉండి కష్టపడి పనిచేసేవారికి, యువతకు ఈ పదవులు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న వరంగల్‌-ఖమ్మం-నల్గొండ, మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని, ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది.

Tags: