Social Activists and Political Analysts: ప్రస్తుత సర్‌ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌) ప్రక్రియను పూర్తిగా రద్దు చేయాలని పలువురు సామాజికవేత్తలు, రాజకీయ విశ్లేషకులు డిమాండ్‌ చేశారు. సర్‌లో లోపాలు ఎత్తిచూపుతున్న వారిపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలు ఆయన స్థాయికి తగ్గట్టుగా లేవని వారు విమర్శించారు.

తెలంగాణ ఓటర్‌ రైట్స్‌ ఫోరం (టీవీఆర్‌ఎఫ్‌) ఆధ్వర్యంలో బషీర్‌బాగ్‌ ప్రెస్‌ క్లబ్‌లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. సర్‌ ప్రజా విచారణలు, వాస్తవాలపై ఓటు పోయిన బాధితులతో కలిసి ఈ సమావేశం జరిగింది.

రాజకీయ విశ్లేషకుడు పరకాల ప్రభాకర్‌ మాట్లాడుతూ ‘‘తొలగించిన ఓట్లలో చనిపోయిన వారు ఉన్నారని... విదేశీయులు ఉన్నారని... మీకేం బాధ అని అంటున్నారు. 2025లో సర్‌ ప్రారంభమైంది. అంటే 2024లో జరిగిన ఎన్నికల్లో చొరబాటుదారులు, విదేశీయులు, డూప్లికేట్‌ ఓటర్లు పాల్గొన్నారా? అలాంటప్పుడు ఆ ఎన్నికల్లో ఏర్పడిన ప్రభుత్వాలు చట్టబద్ధమైనవేనా? సర్‌ అనంతరం తాజా ఓటరు జాబితాతో మళ్లీ ఎన్నికలకు వస్తామని చెప్పండి’’ అని కేంద్రాన్ని ప్రశ్నించారు.

పౌర హక్కుల నేత ప్రొఫెసర్‌ జి. హరగోపాల్‌ ‘‘ముషీరాబాద్‌లో జరిగిన బహిరంగ విచారణలో తమ ఓట్లు అన్యాయంగా తొలగించారని ఎంతోమంది చెప్పారు. బతికి ఉన్న భర్త ఓటును చనిపోయినట్లు పేర్కొంటూ ఎలా తొలగించారో ఒక మహిళ వివరించారు. ఎన్నికల సంఘం సభ్యుల నియామకానికి సంబంధించిన ముగ్గురు సభ్యుల ఎంపిక ప్యానెల్‌ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎందుకు తొలగించారు? ఆయన స్థానంలో అమిత్‌షాను ఎందుకు నియమించారు’’ అని ప్రశ్నించారు.

సామాజిక కార్యకర్త ప్రొఫెసర్‌ పద్మజ షా ‘‘ఓటర్లపై బలవంతంగా రుద్దిన చట్టవిరుద్ధమైన ప్రక్రియే సర్‌. దీని ద్వారా దేశంలో పెద్ద సంక్షోభాన్ని సృష్టించారు’’ అని అన్నారు.

టీవీఆర్‌ఎఫ్‌ నిర్వహించిన సామాజిక తనిఖీల్లో వెల్లడైన వివరాలను నిర్వాహకులు వివరించారు. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ నియోజకవర్గంలో 150, 151 పోలింగ్‌ బూత్‌ల పరిధిలో 757 మందిపై సర్వే నిర్వహించగా, ఏఎస్‌డీడీ పేరుతో 232 మంది ఓట్లను తొలగించారు. వీరిలో 43 మంది ఓట్లను అక్రమంగా తీసివేశారు. ముషీరాబాద్‌ నియోజకవర్గంలో 95 మందిని తొలగించగా 42 మంది స్థానికంగానే ఉన్నారని తెలిపారు.

Tags: