Minister Ponguleti: సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వం పేదలకు నాణ్యమైన విద్య, వైద్య సేవలు అందించేందుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని రెవెన్యూ, గృహనిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి సమీపంలో నిర్మాణంలో ఉన్న వంద పడకల ఆసుపత్రి భవన పనులను కలెక్టర్‌ దివాకర్‌ టీఎస్‌తో కలిసి మంగళవారం పరిశీలించారు. తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

    కూసుమంచిలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ధనిక పిల్లలకు కార్పొరేట్‌ పాఠశాలల్లో లభించే నాణ్యమైన విద్యను పేద విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లోనే అందిస్తున్నామని, కార్పొరేట్‌ ఆసుపత్రుల తరహాలోనే వైద్య సేవలను పేదలకు అందిస్తున్నామని పొంగులేటి చెప్పారు. పేదలకు మెరుగైన వైద్యం అందించే క్రమంలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాలు, అవసరమైన ప్రాంతాల్లో వంద పడకల ఆసుపత్రులు నిర్మిస్తున్నట్లు తెలిపారు. పేదలు ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకున్నా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నామని వివరించారు.

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంతోపాటు కేంద్రంలో కూడా కాంగ్రెస్‌ గెలుపును ఆపటం ఎవరితరం కాదని, రాహుల్‌ గాంధీ ప్రధానమంత్రి కావటం ఖాయమని పొంగులేటి అన్నారు. తెలంగాణ నుంచి దిల్లీకి ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ వెళ్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై ఆధారాలతో ఫిర్యాదు చేసి ఏడాది కావస్తున్నా కేంద్రం ఇంతవరకు చర్యలు తీసుకోలేదని విమర్శించారు.

Tags: