CM Revanth Reddy: విద్యాభివృద్ధికి ఏం కావాలో అడగండి.. ఎలాగైనా తెచ్చిస్తా: సీఎం రేవంత్
సీఎం రేవంత్
CM Revanth Reddy: ప్రపంచంతో పోటీ పడేందుకు విద్యలో నాణ్యత పెరగాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఫిన్లాండ్, జర్మనీలో అవలంబిస్తున్న విధానాలను కేవలం తెలుసుకోవడం కాదని, ఇక్కడ అమలు చేయాలని సూచించారు. విద్య మాత్రమే వెనుకబాటుతనాన్ని తగ్గించగలదని పేర్కొన్నారు.
ఫిన్లాండ్, జర్మనీలో పర్యటించిన ఉపాధ్యాయులతో హైదరాబాద్‌లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. కేవలం భాష నేర్చుకుంటే అవకాశాలు రావని, 12వ తరగతి వరకు విద్యార్థులకు ప్రపంచజ్ఞానం నేర్పాలని అన్నారు.
“ఉపాధ్యాయుల సమస్యల పరిష్కార బాధ్యత నేను తీసుకుంటా. పిల్లల సమస్యలపై ఉపాధ్యాయ సంఘాలు నాతో కొట్లాడాలి. దేశానికి విద్య, వైద్యంలో నాయకత్వాన్ని తెలంగాణ నుంచి ఎందుకు ఇవ్వలేం? నేనూ మిడిల్ క్లాస్.. ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నా. గవర్నమెంట్ స్కూల్‌లో చదువుకుని ఏమవుతావని అడిగితే సీఎం అవుతానని చెప్పా. 2034 వరకు నేనే సీఎంగా ఉంటా” అని రేవంత్‌రెడ్డి అన్నారు.
జనవరి 2024కు ముందు ఒకటో తేదీన ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు పడ్డాయా అని ప్రశ్నించారు. ఉద్యోగులకు ఒకటో తేదీన వేతనాలు ఇవ్వకపోతే ప్రభుత్వం విఫలమైనట్లేనని స్పష్టం చేశారు. ఐఏఎస్ అధికారులను చేసినంత సులువుగా టీచర్లను బదిలీ చేయలేమని, ఆరు నెలలకోసారి ఉపాధ్యాయులతో సమావేశమై సమస్యలపై చర్చిస్తానని హామీ ఇచ్చారు.
“విద్య, పిల్లలపై ఖర్చు చేసేందుకు నాకు ఇబ్బంది లేదు. ఏం కావాలో అడగండి.. ఎలాగైనా తెచ్చిస్తా. మీ మండలంలో ఉన్న ప్రతి విద్యార్థీ ప్రభుత్వ పాఠశాలకు రావాలి. ఆదేశాలు పైనుంచి కాదు.. కింద నుంచి రావాలి. మండలాల్లో విద్యాభివృద్ధికి ఏం కావాలో ఉపాధ్యాయులు సలహాలు, సూచనలు ఇవ్వండి” అని కోరారు.
విద్యాశాఖకు రాజీనామా చేయాలని కొందరు విపక్ష నేతలు కోరుతున్నారని ప్రస్తావిస్తూ, “నేనెందుకు రాజీనామా చేయాలి? విద్యార్థులకు అల్పాహారం అందించినందుకా? ఐటీఐలను కాకుండా ఏటీసీలు ఏర్పాటు చేసినందుకా?” అని ప్రశ్నించారు. ప్రభుత్వ కాలేజీలో చదివితే ఉద్యోగం వస్తుందనే నమ్మకాన్ని విద్యార్థులకు కల్పించాలని సీఎం సూచించారు.