Big Relief for Metro Projects: మెట్రోకు భారీ ఊరట: పాత అప్పులకు ఐఆర్‌ఎఫ్‌సీ ద్వారా రూ.13,527 కోట్ల రీఫైనాన్సింగ్

పాత అప్పులకు ఐఆర్‌ఎఫ్‌సీ ద్వారా రూ.13,527 కోట్ల రీఫైనాన్సింగ్

Update: 2026-05-26 12:10 GMT

దిల్లీలో త్రైపాక్షిక ఒప్పందం.. వడ్డీ భారం తగ్గనుంది

Big Relief for Metro Projects: హైదరాబాద్‌ మెట్రో రైలు మొదటి దశ ప్రాజెక్టుకు భారీ ఆర్థిక ఊరట లభించింది. ఇండియన్‌ రైల్వే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (ఐఆర్‌ఎఫ్‌సీ) ద్వారా రూ.13,527 కోట్ల రీఫైనాన్సింగ్‌తో పాత రుణాలను తక్కువ వడ్డీకి మార్చుకోవడం సాధ్యమైంది. దిల్లీలో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఈ త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది.

ఐఆర్‌ఎఫ్‌సీ సీఎండీ, సీఈవో మనోజ్‌కుమార్‌ దూబే, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు సమక్షంలో ఐఆర్‌ఎఫ్‌సీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సునీల్‌కుమార్‌ గోయల్, హైదరాబాద్‌ మెట్రోరైలు లిమిటెడ్‌ (హెచ్‌ఎంఆర్‌ఎల్‌) ఎండీ సర్ఫరాజ్‌ అహ్మద్, ఎల్‌అండ్‌టీ మెట్రో రైలు (హైదరాబాద్‌) లిమిటెడ్‌ ఎండీ కేవీబీ రెడ్డి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.

తెలంగాణ ప్రభుత్వ హామీతో 20 ఏళ్ల కాల వ్యవధిలో ఈ రుణం అందుబాటులోకి వస్తుంది. త్రైమాసిక వాయిదాల్లో చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ఎలాంటి ప్రాసెసింగ్ లేదా ఇతర ఛార్జీలు లేవు.

వడ్డీ భారం నుంచి విముక్తి

హైదరాబాద్‌ మెట్రో మొదటి దశను ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)లో ఎల్‌అండ్‌టీ మెట్రోరైలు (హైదరాబాద్‌) లిమిటెడ్ నిర్మించి నిర్వహించింది. నిర్మాణం కోసం బ్యాంకుల కన్సార్షియం నుంచి భారీ ఎత్తున రుణాలు తీసుకోగా, ఎల్‌అండ్‌టీ హామీ ఇచ్చింది.

గత ఏడాది రాష్ట్ర సర్కారు రెండో దశ విస్తరణకు మార్గం సుగమం చేసేందుకు మొదటి దశలో 100 శాతం వాటా కొనుగోలు చేయాలని నిర్ణయించింది. గత నెల 29న ఎల్‌అండ్‌టీతో ఒప్పందం కుదిరింది. దీంతో ప్రాజెక్టు పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చింది. ఈక్విటీ రూ.1,461.57 కోట్లు ఎల్‌అండ్‌టీకి చెల్లించనున్నారు. పాత రుణాలు కూడా సర్కారుకు బదిలీ అయ్యాయి.

ఇప్పటి వరకు ఉన్న రుణాల వడ్డీ రేట్లు గరిష్ఠంగా 9.5 శాతం వరకు ఉండేవి. కొత్త ఒప్పందం ద్వారా వార్షికం 3.5 శాతం వడ్డీకి ఐఆర్‌ఎఫ్‌సీ నుంచి రుణం తీసుకుని, పాత రుణాలు (ఎన్‌సీడీలు, కమర్షియల్ పేపర్లు, ఇతర టర్మ్ లోన్లు) తీర్చేసే అవకాశం వచ్చింది. దీంతో మెట్రో ప్రాజెక్టు దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వం మరింత బలపడనుంది.

Tags:    

Similar News