Minister Vakiti Srihari: కృష్ణా జలాలపై మాట్లాడే హక్కు బీఆర్ఎస్‌కు లేదు: మంత్రి వాకిటి శ్రీహరి

మంత్రి వాకిటి శ్రీహరి

Update: 2026-07-28 11:55 GMT

Minister Vakiti Srihari: కృష్ణా జలాలపై మాట్లాడే హక్కు బీఆర్ఎస్‌కు లేదని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో కర్ణాటకలో డ్యాంలు కట్టినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు.

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కర్ణాటకలోని గూడూరు ప్రాంతాన్ని సందర్శించి రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన విమర్శలను మంత్రి ఖండించారు. “జూరాల ప్రాజెక్టు పరిధిలోని రైతుల ప్రయోజనాలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. భీమా, కృష్ణా నదుల నీటిని నిల్వ చేసి సాగు, తాగునీరు అందించాలనే ఆలోచన కూడా గత ప్రభుత్వానికి రాలేదు” అని ఆయన అన్నారు.

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందని, కర్ణాటక ప్రభుత్వంతో సమన్వయం చేస్తూ కృష్ణా, భీమా నదులపై బ్యారేజీ-కమ్-బ్రిడ్జిల నిర్మాణానికి సంబంధించిన డీపీఆర్‌లు సిద్ధం చేశామని తెలిపారు. జూరాల ముంపు గ్రామాలైన భూత్పూర్, నేడుగం, అనుగొండ, అంకెనపల్లి, దాదంపల్లి ప్రజల సమస్యలను దశాబ్దకాలంగా పట్టించుకోలేదని, ప్రస్తుతం ఆ గ్రామాల అభివృద్ధి, పునరావాసం, భూత్పూర్ డ్యాం విస్తరణపై ప్రత్యేక దృష్టి సారించామని పేర్కొన్నారు.

“పాలమూరు ప్రజల భవిష్యత్తు కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంటే, ప్లకార్డులు పట్టుకుని రాజకీయ డ్రామాలు చేయడం వల్ల ప్రజలు నమ్మే పరిస్థితి లేదు” అని మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు.

Tags:    

Similar News